నేటి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుపై రయ్.. రయ్
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:05 AM
రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది! అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభిస్తారు.
రెండు స్టీల్ బ్రిడ్జీలు సహా సవాళ్లను ఎదుర్కొని పూర్తయిన నిర్మాణం
నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం
ఆ వెంటనే ప్రజాప్రతినిధుల క్వార్టర్స్‌కు శ్రీకారం
గురువారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనున్న రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్
1. బకింగ్ హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జి
2. కొండవీటి వాగుపై స్టీల్ బ్రిడ్జి 3. సీడ్ యాక్సెస్ రోడ్
ప్రజాప్రతినిధుల కోసం.. ప్రారంభానికి సిద్ధమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయం
గుంటూరు (రాజధాని), ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది! అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభిస్తారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించి రాయపూడి చేరుకుని అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను సీఎం అందుకుంటారు. ఆ భవనాలను జీఏడీ పరం చేస్తారు. అలాగే రెండు స్టీల్ బ్రిడ్జిలనూ ప్రారంభిస్తారు. ఇలా.. ఒకే రోజు మూడు కీలక ఘట్టాలు ఆవిష్కృతం అవుతుండటం, ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానంలో భాగంగా నిర్మించిన రెండు స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ ఏర్పాట్లను బుధవారం మంత్రి నారాయణ పరిశీలించారు. 110 మీటర్ల పొడవుతో బకింగ్‌హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జి, 280 మీటర్ల పొడవుతో కొండవీటి వాగు, గుంటూరు చానల్‌పై మరో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. ఉండవల్లి నుంచి నేరుగా అమరావతికి కనెక్టివిటీ రావడంతో మంగళగిరి, విజయవాడ ప్రజలు నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించవచ్చని నారాయణ తెలిపారు. అమరావతికి స్వాగతం పలుకుతూ, స్టీల్ బ్రిడ్జి వద్ద ఏ...ఆకారంలో పైలాన్ ఏర్పాటు చేశారు.
అడుగడుగునా అడ్డంకులు..
రాజధాని రవాణా వ్యవస్థలో సీడ్ యాక్సెస్ రోడ్డుది కీలకపాత్ర. తాడేపల్లి నుంచి రాయపూడి వరకూ 21.78 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి రాజధాని మొత్తానికి కనెక్టివిటీని అందిస్తుంది. అమరావతి నలుమూలలనూ కలిపే 17 ఎన్ సిరీస్ రోడ్లను, పాత, కొత్త జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 16)ని అనుసంధానిస్తుంది. అందుకే అమరావతి నిర్మాణంలో తొలి దశలోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. కానీ దీనికి ఎదురైన ఆటంకాలు అన్నీఇన్నీ కావు. మెజారిటీ రైతులు భూములిచ్చినప్పటికీ, వేళ్ల మీద లెక్కించదగిన అతికొద్ది మంది మాత్రం తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు. 2015 నుంచి ఇప్పటివరకూ భూసమీకరణకు సహకరించకుండా ఇబ్బందికి గురిచేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కొందరు రైతులను రెచ్చగొట్టి హైకోర్టులో కేసుల పరంపర కొనసాగించారు. భూ సమీకరణకు సహకరించకపోవడమే కాకుండా, భూసేకరణను సవాల్ చేస్తూ వచ్చారు. ఫలితంగా 2018లో మొదలైన భూసేకరణ ప్రక్రియ ఈ ఏడాది జూలైకు గాని పూర్తి కాలేదు. ఈ నెల 11వ తేదీన హైకోర్టు కేసులు కొట్టివేయడంతో తక్కిన..రోడ్డు నిర్మాణానికీ అడ్డంకులు తొలగిపోయాయి.
మూడు దశల్లో నిర్మాణం...
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూములివ్వని కారణంగా ఈ రోడ్డును మూడు దశల్లో నిర్మించాల్సి వచ్చింది. ఇందుకు పదేళ్ల కాలం పట్టింది. తొలి దశలో ఫేజ్ 1 కింద 2019 నాటికి రాయపూడి నుంచి వెంకటపాలెంలోని మంతెన ఆశ్రమం వరకూ 14.35 కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఆ నిర్మాణాన్ని ఆపేసింది. మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వం రావడంతో పనులు మొదలయ్యాయి. భూసేకరణ ద్వారా భూములు సేకరించి ఫేజ్ 2 కింద 3.92 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. ఫేజ్ 3లో భాగంగా ఉండవల్లి పంపింగ్ హౌస్ వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. ఈ ఫేజ్ పనుల్లో భాగంగా నిర్మించే రోడ్డు మణిపాల్ ఆస్పత్రి వద్ద పాత ఎన్‌హెచ్ 16ను కలుస్తుంది. మూడో ఫేజ్‌లో నిర్మించే 3.51 కిలోమీటర్ల రోడ్డును పూర్తి ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మిస్తారు. కాగా.. భూసేకరణపై వచ్చిన వ్యాజ్యాలను తాజాగా హైకోర్టు కొట్టివేయడంతో మంతెన సత్యనారాయణ ఆశ్రమం సమీపంలో పెండింగులో ఉన్న 0.65 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని పనులను ప్రారంభించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్...
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణం 2018లో మొదలయింది. 2019 మార్చి నాటికి ఈ భవనాలకు సంబంధించిన సివిల్ వర్క్ పూర్తయింది. బయటివైపు గోడలకు రంగులు కూడా వేశారు. ప్లంబింగ్, విద్యుదీకరణ తదితర పనులు పూర్తయ్యాయి. కానీ 2019లో ప్రభుత్వం మారడంతో వాటికి ఐదేళ్లపాటు గ్రహణం పట్టింది. 2024 తరువాత గ్రహణం వీడి నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. రాజధాని అమరావతిలో తొలిగా అందుబాటులోకి వచ్చే నివాస సముదాయంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ రికార్డు సృష్టించనున్నాయి. 10.48 ఎకరాల్లో 216 ఫ్లాట్లు ప్రజా ప్రతినిధుల కోసం సిద్ధమయ్యాయి.
ఇదే ఇదే అమరావతి....
అక్కడ నిర్మాణ యజ్ఞం సాగుతోంది. కార్మికులే రుత్వికులు! యంత్ర శబ్దాలే మంత్రాలు! ఒక్కొక్కటిగా పూర్తవుతున్న నిర్మాణాలే... యజ్ఞ ఫలాలు! ఇది... ఆంధ్రుల రాజధాని అమరావతి నగర నిర్మాణ విహంగ వీక్షణం! అతిముఖ్యమైన నిర్మాణాలన్నింటినీ ఒకే చిత్రంలో చూపించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ చేస్తున్న ప్రయత్నం! రాజధానిలో కొన్ని నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేసుకోగా... మరికొన్ని చకచకా సాగుతున్నాయి. అల్లంత దూరాన ఉన్న ‘విట్-అమరావతి’... దాని సమీపంలోనే ఎన్జీవోలు, క్లాస్-4 ఉద్యోగుల క్వార్టర్స్... ఆ పక్కనే ప్రస్తుత హైకోర్టు... దాని వెంటే సచివాలయం, సీఎంవో ఐకానిక్ టవర్స్, అటువైపున నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులు, దాని ముందే న్యాయమూర్తుల బంగ్లాలు, కొత్త అసెంబ్లీ భవనం, చంద్రబాబు నివాసం, ఇంకా అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్, బంగళాలు! వీటన్నింటితో ఒక నగర నిర్మాణం జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్లు అమరావతి నిరాదరణకు గురైంది. మూడుముక్కలాటకు బలైపోయింది. ఆ ప్రాంతమంతా చిట్టడవిని తలపించింది. కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి తిరిగి ఊపిరిపోసుకుంది. అన్ని అడ్డంకులను అధిగమించి ఇప్పుడు ఇలా నగర రూపు సంతరించుకుంటోంది. గురువారం ప్రజా ప్రతినిధుల భవనాల తాళాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగిస్తున్నారు. రాజధానిలో ‘రాజమార్గం’ సీడ్ యాక్సెస్ రోడ్డును కూడా ప్రారంభిస్తున్నారు. విజయవాడ నగరంతో అమరావతిని అనుసంధానించడంలో ఎంతో కీలకమైన బకింగ్ హామ్ కెనాల్, కొండవీడు వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలనూ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ‘కరకట్ట’పై వెళ్లాల్సిన కష్టాలను తీరుస్తూ... ఉండవల్లి వైపు నుంచే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎక్కి రయ్య్‌మంటూ రాజధానిలో ఇట్టే అడుగు పెట్టేయవచ్చు.
సీఎం పర్యటన వివరాలు..
గురువారం ఉదయం 10.20 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. 10.35 గంటలకు శిలాఫలకం ఆవిష్కరిస్తారు. 10.45 గంటలకు ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా ప్రయాణించి రాయపూడికి చేరుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.25 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు.
వార్తలు కూడా చదవండి...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం
నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News