Share News

పళ్లతో ‘పాప్స్‌’

ABN , Publish Date - Aug 16 , 2026 | 10:01 AM

చాక్లెట్‌ తీపి వెనుక అధిక చక్కెర, కృత్రిమ రంగులు, కొవ్వు పదార్థాలు దాగి ఉంటాయని వైద్యులు తరచూ హెచ్చరిస్తుంటారు.

పళ్లతో ‘పాప్స్‌’
AP News

చాక్లెట్‌ తీపి వెనుక అధిక చక్కెర, కృత్రిమ రంగులు, కొవ్వు పదార్థాలు దాగి ఉంటాయని వైద్యులు తరచూ హెచ్చరిస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఫ్రూట్‌ చాక్లెట్లు (పాప్స్‌) అందించే దిశగా ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. ఆ విశేషాలే ఇవి...

పిల్లలు, యువతలో చాక్లెట్‌లపై అధిక మక్కువ పెరగడాన్ని శాస్త్రవేత్తలు ‘చాకోహాలిజం’ అంటున్నారు. ఇది తీపి తినాలనే కోరిక మాత్రమే కాదు; అధిక చక్కెర వినియోగం, పేగుల ఆరోగ్యం, జీవక్రియలపై ప్రభావం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే అలవాటు. ఈ సమస్యకు ఆరోగ్యకరమైన పరిష్కారం చూపుతున్నారు ఒక సైంటిస్ట్‌. ఆయన కని పెట్టిన ‘ఫ్రూట్‌ పాప్స్‌’ పూర్తిగా తాజా పండ్లతో తయారైన సహజ తీపి స్నాక్‌.


ఈ ఫ్రూట్‌ పాప్స్‌ను ఫుడ్‌ సైంటిస్ట్‌ డా. చెన్నకేశవరెడ్డి, ఎస్వీయూ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ డా. సుచరిత గైడెన్స్‌లో అభివృద్ధి చేశారు. చాక్లెట్‌ రుచిని కోరుకునేవారికి పండ్లలోని పోషకాలను అందించాలనే ఉద్దేశంతో దీనిని అభివృద్ధి చేశారు. ఈ ఉత్పత్తిలో శుద్ధి చేసిన చక్కెర, కృత్రిమ రంగులు, కృత్రిమ ఫ్లేవర్లు లేదా రసాయన ప్రిజర్వేటివ్‌లకు చోటు లేదు. పండ్లలో సహజంగా ఉండే తీపినే ఉపయోగిం చడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


book4.2.jpgపండ్లనే చాక్లెట్‌లా...

పిల్లల్లో చాక్లెట్లు, క్యాండీలు, అధిక చక్కెర కలిగిన స్నాక్స్‌ వినియోగం పెరుగుతుండటంతో ఊబకాయం, దంత సమస్యలు, జీవనశైలి సంబంధిత అనారోగ్యాలపై ఆందోళన వ్యక్తమవు తోంది. అలాంటి పరిస్థితుల్లో సహజ పండ్ల ఆధారిత ప్రత్యామ్నాయాల అభివృద్ధి అవసరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ‘‘పిల్లలు ఇష్టపడే రుచి, ఆకర్షణీ యమైన రూపంతో పాటు పోషక విలువలు కూడా అందేలా అనేక పరీక్షల తర్వాత ఈ ‘ఫ్రూట్‌ పాప్స్‌’ తయారు చేశాం. అయితే వాస్తవానికి ఇది చాక్లెట్‌ కాదు. చాక్లెట్‌లో పండ్ల రుచి కలపడం కాదు.


పండ్లనే చాక్లెట్‌లా కనిపించేట్టు, తినడానికి సులభమైన ఆకారం లోకి మార్చిన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి. ఇదే ఈ పరిశోధన ప్రత్యేకత. భవిష్యత్తులో ఇటువంటి ఉత్పత్తులు వాణిజ్య పరంగా అందుబాటులోకి వస్తే రైతులకు కూడా కొత్త మార్కెట్‌ ఏర్పడవచ్చు. పనస, నేరేడు, మామిడి, జామ, బొప్పాయి, అనాస, అరటి వంటి స్థానిక పండ్లకు విలువ జోడించి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి తీసుకురావచ్చు. తద్వారా పండ్ల వృథాను తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది’’ అని వివరించారు చెన్నకేశవరెడ్డి.


book4.jpgకడప జిల్లా అలంఖాన్‌పల్లి గ్రామానికి చెందిన డా.సంగటి చెన్న కేశవరెడ్డి ఆహార సాంకేతికత, పోషకాహార శాస్త్ర రంగాల్లో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పరిశోధకుడు. ఫుడ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఫుడ్‌ సైన్స్‌, ఫుడ్‌ సేఫ్టీ, క్వాలిటీ అష్యూరెన్స్‌, ఉత్పత్తుల అభివృద్ధి వంటి విభాగాల్లో విశేష అనుభవం సంపాదించారు. ఇప్పటిదాకా ఆయన నాలుగు భారతీయ పేటెంట్లు సాధించారు. వాటిలో రెండు నాగజెముడు పండ్ల విలువ ఆధారిత ఉత్పత్తులపై, మరొకటి ఇసుక కొరత సమస్యకు ప్రత్యామ్నాయం, ఇంకొకటి ఎడారి మొక్కల నుంచి ఇంధన ప్రత్యామ్నాయం తయారీ సాంకేతికతపై ఉన్నాయి.


ఆయన ఆలోచన వెనుక మరో సామాజిక అవసరం కూడా ఉంది. భారతదేశంలో ప్రతీ ఏడాది లక్షల టన్నుల సీజనల్‌ పండ్లు సరైన మార్కెట్‌ లేక, నిల్వ సౌకర్యాలు లేక, ప్రాసెసింగ్‌ అవకాశాలు లేక వృథా అవుతున్నాయి. రైతు ఎంతో కష్టపడి పండించిన పండు కొన్నిసార్లు చెట్టు నుంచి కిందకు రాలిపోతుంది. మరికొన్ని రవాణాలో పాడవుతాయి. ఒకవైపు రైతు నష్టపోతుంటే, మరోవైపు పిల్లలు పోషకాహారం కన్నా ప్రాసెస్డ్‌ స్నాక్స్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే ఈ సాంకేతికత రూపుదిద్దుకుంది.


book4.4.jpgఆరోగ్య ప్రయోజనాలు...

ఈ చాక్లెట్లను పూర్తిగా ఆహార శాస్త్ర సూత్రాల ఆధారంగా రూపొందించారు. ముందుగా సరైన పరిపక్వతలో ఉన్న పండ్లను ఎంపిక చేస్తారు. వాటిని శుభ్రపరిచి, ముక్కలుగా కట్‌ చేస్తారు. అనంతరం ప్రత్యేక ప్రీ- ట్రీట్‌మెంట్‌ చేసి, ఒక శాతం ఉప్పు ద్రావణంలో నానబెట్టి, 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద 48 గంటల పాటు నియంత్రిత విధానంలో ఎండబెట్టి తేమ పూర్తిగా తొలగేలా చూస్తారు. తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన డైస్‌లో కంప్రెషన్‌ పద్ధతితో ఒత్తి చాక్లెట్‌లా ఆకారంలోకి తీసుకొచ్చి ప్యాక్‌ చేస్తారు. ఎలాంటి కృత్రిమ అడిటివ్స్‌, కృత్రిమ రంగులు లేదా అదనపు పదార్థాలు ఉపయోగించకుండా వీటిని తయారు చేస్తున్నారు. ఈ ఫ్రూట్‌ పాప్స్‌ పూర్తిగా డీహైడ్రేట్‌ చేసిన పండ్ల ముక్కలతోనే తయారవుతాయి. ఇందులో కరిగే, సులభంగా జీర్ణమయ్యే పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. అందువల్ల దీనిని కేవలం స్నాక్‌గా కాకుండా ‘న్యూట్రాస్యూటికల్‌ ఫుడ్‌’ (ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారం)గా తయారు చేశారు.


పండ్లను ఎండబెట్టి నిల్వ చేయడం లేదా జ్యూస్‌, జామ్‌, జెల్లీ వంటి ఉత్పత్తులు తయారు చేయడం సాధారణమే. అయితే పండ్లనే పిల్లలు ఇష్టపడే చాక్లెట్‌లాంటి ఆకారంలోకి మార్చడం ఈ పరిశోధనలోని వినూత్న అంశం. ఈ ఆవిష్కరణల వల్ల పనస, సపోటా, అనాస వంటి సీజనల్‌ పండ్లతో పాటు మార్కెట్‌లో పెద్దగా డిమాండ్‌ లేని లేదా తక్కువగా వినియోగించే పండ్లను కూడా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చవచ్చు.


దీంతో పండ్ల వృథా తగ్గడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పడితే స్థానిక ఉపాధి కూడా పెరుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వినియోగ దారులు ‘క్లీన్‌ లేబుల్‌ ఫుడ్స్‌’, ‘నేచురల్‌ స్నాక్స్‌’, ‘షుగర్‌ ఫ్రీ’ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో పండ్లతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతకు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా డిమాండ్‌ ఉండే అవకాశం కనిపిస్తోంది.

  • శ్యాంమోహన్‌, 94405 95858


ఈ వార్తలు కూడా చదవండి:

వరుసగా రెండో ఏడాది ఖర్గే, రాహుల్‌ డుమ్మా

నెగిటివ్‌ పాత్రలైనా చేస్తా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 10:01 AM