Share News

మాన్‌సూన్‌ కాకర!

ABN , Publish Date - Aug 16 , 2026 | 08:34 AM

వర్షాకాలం... వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారుతుంది. చుట్టూ పరిసరాలు ఆకుపచ్చగా మారిపోతాయి.

మాన్‌సూన్‌ కాకర!
Vantalu

వర్షాకాలం... వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారుతుంది. చుట్టూ పరిసరాలు ఆకుపచ్చగా మారిపోతాయి. ఆకుపచ్చని కూరగాయలు మార్కెట్‌ను ముంచెత్తుతాయి. అలా వానాకాలంలో ఆరోగ్య అతిథిగా పలకరించేది బొంత కాకరకాయ. ఈ కూరగాయ రుచిలో మేటి. ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అరచేతిలో ఇమిడిపోయే బొంతలో అణువణువూ సుగుణాలు ఎన్నో.

అలా వానలు మొదలవ్వగానే... వంటింట్లోంచి వచ్చే ఘుమఘుమల్లో ఇట్టే తేడా కనిపిస్తుంది. అల్లం, వెల్లుల్లి, పుదీనా తదితరాల వాడకం ఎక్కువవుతుంది. మార్కెట్‌లో గుమ్మడికాయ, కాకరకాయ, బెండకాయ, పొట్లకాయ లాంటి కూరగాయల హవా మొదలవుతుంది. అయితే ఏడాది పొడవునా దొరికే వీటిని పట్టించుకోకుండా... వానాకాలపు ఆరోగ్య అతిథి కోసం తెగ వెదుకుతుంటారు గృహిణులు. అదే బొంత కాకరకాయ.... కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయ, అడవి కాకరకాయ అంటారు. కేవలం మాన్‌సూన్‌ సీజన్‌లోనే కనిపించే బొంత కాకరకాయ ఎంతో అపురూపమైన కూరగాయ. ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్య కారణాలతో ఈ సీజన్‌లో వీటిని తప్పక తింటుంటారు.


book3.3.jpgఒక్కో చోట ఒక్కో పేరు...

భారతదేశం ఎంతో వైవిధ్యమైన దేశమని చెప్పడానికి బొంత కాకరకాయను చూపొచ్చు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో దీనిని పిలుస్తుంటారు. తెలుగువాళ్లు అడవి కాకరకాయ, బోడ కాకరకాయ, బొంత కాకరకాయ అంటారు. అదే హిందీలో - కాకోడా, మరాఠీలో - కంటోలి, గుజరాతీలో - కంటోలా, తమిళంలో- మూకు పావక్కాయ్‌, మలయాళంలో - కొట్టుపావక్కా, కన్నడలో - మాడహాగలకాయి... ఇలా వీటికి ఎన్నో పేర్లు. దీని తోలుపై మెత్తని ముళ్లు ఉండడం వల్ల ఇంగ్లీష్‌లో ‘స్పైనీ గార్డ్‌’ అంటారు. దేశమంతా ఈ కూరగాయ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ... మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ప్రజలు అమితంగా బొంత కాకరకాయ రుచుల్ని ఆస్వాదిస్తారు.


మల్టీ విటమిన్లకు చిరునామా...

పేరును బట్టి బొంత కాకరకాయ, మామూలు కాకరకాయలాగానే చేదుగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి రెండూ ఒకే కుటుంబానికి చెందినా కూడా కాకరకాయంత చేదు ఇందులో ఉండదు. పైగా రెండిటి రూపం వేరు. కాకరకాయ పొడుగ్గా, తోలంతా గచ్చులు గచ్చులుగా ఉంటుంది. బొంత కాకరకాయ పరిమాణం చిన్నది. గుప్పిట్లో ఒదిగిపోతుంది. తీగబాకే ఈ కాకరకాయ చెట్లకి ఎక్కువ ఆలనా పాలనా, నీళ్ల అవసరం ఉండదు. వర్షాలు పడగానే చిగురించి మొక్కగా పెరిగి, తీగ పాకుతుంది. మనదేశంతో పాటు బంగ్లాదేశ్‌, శ్రీలంకల్లో వీటిని విరివిగా పండించడమే కాకుండా వినియోగిస్తారు కూడా. బొంతలో గింజలు చిన్నవి. కండ ఎక్కువగా ఉండే కూరగాయ ఇది. అందుకే రకారకాల పద్ధతుల్లో రుచికరంగా వండుకోవచ్చు. కూరలే కాకుండా... పచ్చళ్లు, వరుగులు కూడా పెట్టుకోవచ్చు. సాధారణ కాకరకాయ చేదుకు దూరంగా పరుగెత్తే పిల్లలు బొంత కాకరకాయ కూరంటే ఇష్టంగా తింటారు. వేయించిన నువ్వులు, బెల్లం కలిపి కూర చేస్తే ఎవరైనా ఇష్టంగానే తింటారు.


book3.4.jpgఆరోగ్యప్రదాయిని...

ఆరోగ్యానికి వీటిని చిరునామాగా చెబుతారు. బొంత కాకరకాయల్లో విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ బి9తో పాటు ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలున్నాయి. ఇన్ని రకాల విటమిన్లు, మినరల్స్‌ ఉన్నాయి కాబట్టి న్యూట్రిషనిస్టులు బొంత కాకరకాయను ‘మల్టీ విటమిన్‌ పిల్‌’ అని, ‘లిటిల్‌ పవర్‌హౌజ్‌’ అని రికమండ్‌ చేస్తారు. ఇంకా వీటి వల్ల కలిగే విశిష్ట లాభాలేంటో చూద్దాం...

  • రక్తపోటు నియంత్రణ: ఆధునిక జీవనంలో అందరినీ ఇబ్బంది పెడుతోన్న సమస్య అధిక రక్తపోటు. సీజనల్‌గా లభించే బొంత కాకరకాయని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఒక్క కూరగాయ వల్ల ఇది సాధ్యమా? అనే సందేహం రాకమానదు. కానీ ఇది నిజం. ఈ కాకరకాయలో ఎక్కువగా పీచుపదార్థాలుంటాయి. తీసుకున్న ఆహారంలోని చక్కెరలను నెమ్మదిగా గ్రహించేలా చేసి చక్కెర స్థాయులను, తద్వారా బీపీని నియంత్రిస్తుంది. కాబట్టి షుగర్‌ ఉన్న వాళ్లకి ఈ కూరగాయ ఎంతో మేలు చేస్తుంది.


  • జీర్ణవ్యవస్థకు సహాయకారి: పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా సహాయపడుతుంది. గట్‌ ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. పీచుపదార్థాల వల్ల జీర్ణం సాఫీగా సాగేలా చేస్తుంది.

  • చర్మ సంరక్షణ: గరకుగరుకుగా ఉండే బొంత కాకరకాయ చర్మ సంరక్షణకు విశేషంగా దోహదపడుతుంది. దీనికి కారణం ఇందులో తేమ అధికంగా ఉంటుంది. అందుకే చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇంకా ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్‌, పాలీఫెనాల్స్‌ కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. జీవనశైలి వ్యాధులను అరికడుతుంది. విటమిన్‌ ఎ, సి ల వల్ల కొల్లాజన్‌ను ఉత్పత్తి చేసి... శరీరంలోని కణాలు దెబ్బతినకుండా సహాయపడుతుంది. చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది. దీనిని యాంటీ ఏజింగ్‌ ఏజెంట్‌గా పేర్కొంటారు. అలాగే వీటిని ఈ సీజన్‌లో తినడం వల్ల ముఖంపై మొటిమలు, దద్దుర్లు లాంటి వాటిని అరికట్టవచ్చు.


book3.5.jpg

  • బరువు తగ్గుదలకు: ఈ కూరగాయలో తక్కువ క్యాలరీలున్నాయి కాబట్టి బరువు నియంత్రణకు చక్కగా ఉపయోగపడుతుంది. పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్నందువల్ల తరచుగా ఆకలి వేయదు. కడుపు నింపడమే కాకుండా చక్కటి పోషక పదార్థాలను శరీరానికి అందిస్తూ బొంత కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. అన్ని వయసుల వారికీ మంచిది. పీసీఓఎస్‌తో బాధపడుతున్న వాళ్లూ వీటితో లాభపడవచ్చు.

  • కంటి ఆరోగ్యానికి: బొంత కాకరకాయలో కెరోటినాయిడ్స్‌, బీటా కెరోటిన్‌, విటమిన్‌ ఎ ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది.


ఇలా బొంత కాకరకాయలో ఉన్న సుగుణాలెన్నో. అందుకే పోషకాలకు సంబంధించి పవర్‌ హౌజ్‌గా దీన్ని పేర్కొంటారు. అయితే ఆకుపచ్చగా ఉన్న బొంత కాకరకాయలనే తినాలి. పండిన వాటి జోలికి వెళ్లొద్దు. మెత్తని ముళ్ల తొక్కలోనే ఎన్నో పోషకాలున్నాయి కాబట్టి తొక్కతో పాటే వండాలన్నది మర్చిపోకూడదు. ఈ సీజన్‌లో మాత్రమే వచ్చే బొంత కాకరకాయ ఒకరకంగా ఆరోగ్యానికి ఔషధం లాంటింది. అన్నంలోకి పులుసుకూర, రొట్టెల్లోకి ఫ్రైతో పాటు అనేక రకాలుగా ఆరగించొచ్చు. ఆరోగ్యాన్ని పొందొచ్చు.


book3.6.jpgవిత్తనాలకూ గిరాకీ

బొంత కాకరకాయ చెట్టులో అన్నీ ఉపయోగకరమే. అందుకే పది కిలోల విత్తనాల ధర మూడు నుంచి అయిదు వేల రూపాయల వరకు ఉంటుంది. ఎండిన వేర్లను కూడా కిలోకు నాలుగు వందల చొప్పున అమ్ముతుంటారు. ఆకులు, వేర్లు, కాండం, విత్తనాలను ఆయుర్వేద వైద్య విధానంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. తలనొప్పి, పైల్స్‌, పాముకాటు తదితర సమస్యల పరిష్కారంలో ఈ చెట్టు వివిధ భాగాలను వినియోగిస్తారు. చత్తీస్‌గఢ్‌లో కొన్ని ఆదిమ జాతి తెగలు రుమాటిజమ్‌, జ్వరం, డయేరియాలాంటి అనారోగ్యాలను బాగు చేసేందుకు బొంత కాకరకాయ వేర్లను ఉపయోగించడం విశేషం.


book3.jpgవంద గ్రాముల బొంత కాకరకాయలో..

క్యాలరీలు - 17

నీటి శాతం - 84.1 శాతం

కార్బోహైడ్రేట్లు - 7.7 గ్రాములు

ప్రొటీన్లు - 3.1 గ్రాములు

కొవ్వు - 3.1 గ్రాములు

ఫైబర్‌ - 3 గ్రాములు

మినరల్స్‌ - 1.1 గ్రాము


ఈ వార్తలు కూడా చదవండి:

వరుసగా రెండో ఏడాది ఖర్గే, రాహుల్‌ డుమ్మా

నెగిటివ్‌ పాత్రలైనా చేస్తా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 08:34 AM