Share News

మహిళలే మహారాణులు

ABN , Publish Date - Aug 16 , 2026 | 07:02 AM

మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు.

మహిళలే మహారాణులు

  • తీసుకున్న ప్రతి రూపాయీ చెల్లిస్తున్నారు.. ‘స్త్రీ శక్తి’ మిగులుతో వ్యాపారాలు చేస్తున్నారు

  • మహిళా సాధికారతకు నాడు డ్వాక్రా తెచ్చాం.. కుటుంబాల అభ్యున్నతికి మార్గం వేశాం

  • పథకాలను సద్వినియోగం చేసుకోండి.. ఆర్థికంగా ఎదగండి

  • రాజకీయ ముసుగులో ఉండే నేరగాళ్లను ఓ కంట కనిపెట్టండి.. సీఎం పిలుపు

  • ‘స్త్రీ శక్తికి సంవత్సరం.. రెట్టింపైన ఆత్మవిశ్వాసం’ పేరుతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు

  • మహిళలతో కలిసి బస్సు ప్రయాణం.. సీఎం క్యాంపు కార్యాలయంలో మాటామంతి

ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్న సంతృప్తితో ఆగిపోవద్దు. వాటిని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాల్లో మరింతగా రాణించాలి. గంజాయి నిర్మూలనకు డ్వాక్రా సంఘాలు చొరవ తీసుకోవాలి. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని మహిళలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. రాజకీయాలను అడ్డం పెట్టుకుని సమాజంలో అశాంతి సృష్టించే వారిని దూరంగా పెట్టే చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ రావాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి) : మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని, బాగా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏడాది కాలంలో రూ.87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు. రోజుకు సుమారు 27 లక్షల ప్రయాణాలు జరుగుతున్నాయని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆదా చేసుకున్న డబ్బును కుటుంబ అవసరాలకు, వ్యాపారాలకు మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలకు ప్రయాణ స్వేచ్ఛతోపాటు ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసం కూడా పెరిగాయన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘స్త్రీ శక్తికి సంవత్సరం.. రెట్టింపైన ఆత్మవిశ్వాసం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సీఎం అమరావతిలో మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. రాజధానిలోని పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మీదుగా సీఎం క్యాంపు కార్యాలయం వరకు బస్సులో ప్రయాణం సాగించారు.


అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్త్రీ శక్తి లబ్ధిదారులకు తేనీటి విందు ఇచ్చారు. వారితో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చదువుకుంటే మెరుగైన ఆలోచనలు వస్తాయని, మంచి ఆలోచనలు వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకే ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్యం మెరుగుపడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని, ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్య అలవాట్లపైనా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సంజీవని వంటి కార్యక్రమాలతో ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నామని చెప్పారు. మహిళలను ఒకప్పుడు చిన్నచూపు చూసేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చంద్రబాబు అన్నారు. మహిళలే ఎక్కువగా సంపాదించే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. దీనికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు ఉద్యమానికి తానే శ్రీకారం చుట్టానని గుర్తు చేశారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాల ద్వారా సుమారు రూ.25 వేల కోట్ల పొదుపు సొమ్ము బ్యాంకుల్లో ఉందని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మహిళలు క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నారని ప్రశంసించారు. కొన్ని పెద్ద కంపెనీలు కూడా రుణాలు ఎగవేస్తున్న పరిస్థితుల్లో డ్వాక్రా మహిళలు మాత్రం తీసుకున్న రుణాలను ఠంచనుగా చెల్లిస్తున్నారని కొనియాడారు. పీ4 విధానం ద్వారా పేద కుటుంబాలకు చేయూతనిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.


అను నేను...అనే సంకల్పం తీసుకోండి..

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ... ‘అను నేను’ అనే సంక ల్పం తీసుకోవాలని, తమ కుటుంబాన్ని, గ్రామాన్ని తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభు త్వం చేస్తున్న మంచి పనులను అర్థం చేసుకోవాల ని, ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసి ఓట్లేయించుకునే వారిని నమ్మొద్దని సీఎం కోరారు. ఈ మేరకు మహిళలు ప్రచారం చేయాలని సూచించారు.


స్త్రీశక్తి లబ్ధిదారులతో మాటామంతి

సీఎం క్యాంపు కార్యాలయంలో స్త్రీ శక్తి లబ్ధిదారులతో చంద్రబాబు మాటామంతి నిర్వహించారు. ఇళ్లలో మహిళలు ఎక్కువగా సంపాదిస్తున్నారా.. పురుషులు ఎక్కువ సంపాదిస్తున్నారా అని సీఎం అడగ్గా.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకుని మహిళలమే ఎక్కువగా సంపాదించే స్థాయికి వచ్చామని కొందరు తెలిపారు. తాము మరికొందరికి ఉపాధి కూడా కల్పించగలుగుతున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రస్తుతం ఎంత ఆదా అవుతోందనే విషయంతోపాటు.. రాబోయే పదేళ్లలో ఏం సాధించాలనుకుంటున్నారో కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. కోటి రూపాయల పెట్టుబడితో తన డ్వాక్రా సంఘం తరఫున వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కడప నుంచి వచ్చిన ఓ ముస్లిం మహిళ సీఎంకు వివరించారు. ఏఐ రంగంలో నైపుణ్యం సాధించడం ద్వారా తాను ఎంచుకున్న సాఫ్ట్‌వేర్‌ రంగంలో అగ్ర స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని విశాఖకు చెందిన మహిళా ఉద్యోగి తెలిపారు. కాకినాడ జిల్లాకు చెందిన చేపలవ్యాపారి వీరవేణి మాట్లాడుతూ.. స్త్రీ శక్తి ద్వారా రోజుకు రూ.150 ఆదా అవుతోందని, నెలకు సుమారు రూ.4వేలు మిగులుతున్నాయని తెలిపారు. తనకు మధుమేహం ఉందని, ఈ మిగులు డబ్బుతో మందులు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం మహిళ మాట్లాడుతూ, స్త్రీశక్తి ద్వారా తనకు నెలకు రూ.1,500 ఆదా అవుతోందని తెలిపారు. దీంతోపాటు మరో నాలుగు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించే దిశగా కష్టపడాలని మహిళలకు సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే తాను మహిళలతో నేరుగా మాట్లాడుతున్నానని చెప్పారు.

Updated Date - Aug 16 , 2026 | 07:04 AM