డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. అనంతబాబు అరెస్ట్
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:20 PM
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రాజమండ్రి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును (YSRCP MLC Anantha Babu) రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో పోలీసులు ఈరోజు (శుక్రవారం) అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసు మొదటి నుంచీ వివాదాస్పదంగానే కొనసాగుతోంది. తాజాగా బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణకు అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యంగా కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.
సాక్షులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు..
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే అనంతబాబు బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపణలు రావడంతో కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆయనను అరెస్ట్ చేసే సమయంలో కోర్టు సముదాయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
సర్పవరం పోలీస్ స్టేషన్‌కు అనంతబాబు..
అరెస్టు అనంతరం అనంతబాబును కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయనపై తదుపరి విచారణ కొనసాగనుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అనంతబాబును స్టేషన్‌కు తీసుకెళ్లనున్నారు. అక్కడ ఆయనను విచారించి తదుపరి న్యాయ ప్రక్రియలు చేపట్టనున్నారు. ఈ కేసులో సాక్షులు భయపడేలా చేయడం లేదా కేసు నుంచి వెనక్కు తగ్గించేలా ఒత్తిడి తేవడం వంటి చర్యలు న్యాయపరంగా తీవ్రంగా ఉన్నాయి. అందుకే ఈ ఆరోపణలు నిజమని తేలితే, అనంతబాబుపై కేసు మరింత బలపడే అవకాశం ఉంది.
ప్రస్తుతం అనంతబాబు అరెస్టుతో కేసు మరో మలుపు తిరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ రద్దు పిటిషన్‌పై కోర్టు తీసుకునే నిర్ణయం, సాక్షుల వాంగ్మూలాలు, పోలీసుల దర్యాప్తు కలిసి ఈ కేసు తుది తీర్పును నిర్ణయించనున్నాయి. ఈ కేసు ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయం ఉత్కంఠగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News