అనంతబాబు ఇంట్లో పోలీసుల సోదాలు.. అరెస్టుకు యత్నం
ABN , Publish Date - Apr 21 , 2026 | 09:19 PM
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుతో సంబంధం ఉన్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాకినాడ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు (YCP MLC AnanthaBabu) సంబంధించిన కాకినాడలోని అపార్ట్‌మెంట్‌లో పోలీసులు ఈరోజు (మంగళవారం) ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. ముగ్గురు సీఐల బృందం అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ పరిణామం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుతో సంబంధం ఉన్నదిగా తెలుస్తోంది. సాక్ష్యాల ఆధారంగా ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు చేరుకునే సమయానికి అనంతబాబు అక్కడ లేకపోవడం గమనార్హం. పోలీసులు వస్తున్నారనే సమాచారాన్ని ముందుగానే తెలుసుకొని ఆయన పరార్ అయినట్లు తెలుస్తోంది. అనంతబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
సాక్షులను ప్రభావితం చేశారని..
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక సాక్షులను ప్రభావితం చేయడానికి అనంతబాబు ప్రయత్నించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సాక్షుల నుంచి సేకరించిన సమాచారం, ఆధారాల ఆధారంగా పోలీసులు ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
2022 హత్య కేసు నేపథ్యమిదే..
2022 మే 19వ తేదీన వీధి సుబ్రహ్మణ్యం హత్య ఏపీవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే రోజు అనంతబాబు పుట్టిన రోజు కావడం కూడా కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన రోజున రాత్రి అనంతబాబు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుబ్రహ్మణ్యం గత ఆరు సంవత్సరాలుగా అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేశారు. తన వివాహం కోసం అనంతబాబు వద్ద నుంచి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం.
సిట్ దర్యాప్తు..
ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు వంటి కీలక ఆధారాలను సిట్ సేకరించింది. దర్యాప్తులో భాగంగా, ఈ హత్యలో అనంతబాబు పాత్ర ఉందని సిట్ తేల్చినట్లు సమాచారం. అలాగే ఆయన భార్య అనంత లక్ష్మీ దుర్గను ఈ కేసులో ఏ-2గా చేర్చడం కూడా కీలక పరిణామంగా మారింది.
కేసు ప్రస్తుత పరిస్థితి..
ప్రస్తుతం పోలీసులు అనంతబాబు అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షుల ఆధారంగా కేసు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన పరార్‌లో ఉండటం ఈ కేసును మరింత క్లిష్టతరం చేస్తోంది. కాకినాడలో జరిగిన పోలీసుల సోదాలు, అనంతబాబు పరార్ కావడం, డ్రైవర్ హత్య కేసులో కొత్త ఆధారాలు వెలుగులోకి రావడంతో ఈ కేసును మరింత కీలక దశకు చేరుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పోలీసులు చేపట్టే చర్యలు, కోర్టు విచారణ ఈ కేసు దిశను నిర్ణయించనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News