Share News

మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుంది.. సీఎం చంద్రబాబు ధ్వజం

ABN , Publish Date - Apr 20 , 2026 | 06:59 PM

ప్రజాహిత బిల్లులను అడ్డుకోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుందని పేర్కొన్నారు.

మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
CM Chandra babu Naidu,

ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజాహిత బిల్లులను అడ్డుకోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుందని పేర్కొన్నారు. తమిళనాడులో డబుల్ ఇంజిన్ సర్కార్‌ రావాలని ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వివాదంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈరోజు(సోమవారం) తమిళనాడులోని దెన్కనికొట్టైలో ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. థల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నగేశ్ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీఎం తమిళంలో ప్రసంగించారు. ఇటీవల చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలను ప్రజలంతా చూశారన్నారు. కాంగ్రెస్ మహిళా బిల్లును వ్యతిరేకించిందని చెప్పుకొచ్చారు. మరోవైపు, ఇది 'ఢిల్లీపై తమిళనాడు సాధించిన విజయం' అని డీఎంకే చెప్పుకుంటోందని అన్నారు. అసలు డీఎంకే సాధించింది ఏమిటి..? అని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రానికి సీట్ల సంఖ్య పెరుగుతుందని, సుమారు 50 శాతం అదనపు ప్రాతినిధ్యం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు 25 సీట్లు ఉన్నాయని.. మరో 13 సీట్లు కలిస్తే ఆ సంఖ్య 38కి చేరుతుందని వివరించారు. తమిళనాడుకు 39 సీట్లు ఉన్నాయని.. మరో 20 సీట్లు పెరిగితే ఆ సంఖ్య 59కి చేరుతుందని వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు అడ్డుకున్నారో నిజాయతీగా చెప్పాలని డీఎంకేని నిలదీశారు.


దేశాన్నే ఓడించినట్లు కాదా..?

తాము ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించి ఓడించామని వారు చెబుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి నేతలు ప్రధానిని ఓడిస్తే, దేశాన్నే ఓడించినట్లు కాదా.? అని ప్రశ్నించారు. డీఎంకే నేతలు మహిళలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఇండియా కూటమి నేతలు జవాబుదారీగా ఉంటారని.. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో ఇక్కడి ప్రజలు చూశారని అన్నారు. తమిళనాడు కూడా వేగంగా అభివృద్ధి చెందాలంటే, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమా..? కాదా.. ? అని అడిగారు. గడిచిన 22 నెలల్లో, తాము విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు పయనించామని తెలిపారు. తన మిత్రుడు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చినప్పుడు, కేంద్రం పూర్తి మద్దతు ఇచ్చిందని ప్రస్తావించారు. అమరావతిని ఒక వైభవమైన రాజధానిగా నిర్మిస్తామని ఉద్ఘాటించారు. పోలవరం పూర్తి చేస్తామని... నదుల అనుసంధాన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు.దేవుడి దయ ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానం పూర్తయిన తర్వాత, నీటిని తెలుగు గంగ వరకు మాత్రమే కాకుండా కావేరి వరకు కూడా తీసుకెళ్లవచ్చని చెప్పుకొచ్చారు. ఇది జరగాలంటే, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉండాలని తెలిపారు. గంగా - కావేరి అనుసంధానం జరగాలని, దానికి ముందు గోదావరీ అనుసంధానం జరగాలని పేర్కొన్నారు. మనం నీటి కోసం ఘర్షణలు లేకుండా, సామరస్యంతో ముందుకు సాగాలని సూచించారు. జాతీయ ఐక్యత చాలా అవసరమన్నారు. తమిళ, తెలుగు, కన్నడ ప్రజలైనా సరే, అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.


దక్షిణ భారతదేశానికి ఎలాంటి అన్యాయం జరగదు..

డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి ఎలాంటి అన్యాయం జరగదని తెలిపారు. ప్రధాని మోదీ అన్ని దక్షిణ రాష్ట్రాలను ఘనంగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నారని వివరించారు. ఒకప్పుడు తమిళనాడు అన్ని విషయాల్లోనూ ముందుండేదని.. కానీ ఇప్పుడేమైందని ప్రశ్నించారు. గతంలో చెన్నై ఎన్నో నగరాల కంటే ముందుండేదని, కానీ ఇప్పుడు అది బెంగళూరు, హైదరాబాద్‌తో పోటీ పడగలదా.? అని అడిగారు. మనం సంస్కరణల్లో, అభివృద్ధిలో గానీ ముందుకు సాగలేకపోతున్నామని.. రాజకీయాల్లో మాత్రం అన్నిచోట్లా ముందున్నట్లు కనిపిస్తున్నామని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రపంచ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించాలని యోచిస్తున్నామని అన్నారు. ఇది బెంగళూరు, హైదరాబాద్‌లోని విమానాశ్రయాలతో పోటీపడి, వాటి కంటే మెరుగ్గా కూడా ఉండగలదని తెలిపారు. అదే అభివృద్ధి.. అదే పోటీతత్వమని వివరించారు. ప్రతిదాన్నీ వ్యతిరేకించడం సరైన పద్ధతి కాదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

జగన్‌ నుంచి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు ప్రమాదం ఉంది: గోరంట్ల

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 07:10 PM