Share News

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

ABN , Publish Date - Feb 18 , 2026 | 03:39 PM

ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. కర్నూలు కోవాబన్ వలీకి మంత్రి నారా లోకేశ్ అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..
Undavalli Arun Kumar

రాజమండ్రి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై (Nara Lokesh) మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ప్రశంసలు కురిపించారు. కర్నూలు కోవాబన్ వలీకి మంత్రి నారా లోకేశ్ అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు. బీజేపీ అలయన్స్‌లో ఉండి ముస్లింకి లోకేశ్ అండగా నిలవడంపై అభినందించాలని పేర్కొన్నారు. రాజమండ్రిలో ఇవాళ(బుధవారం) మీడియాతో ఉండవల్లి మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రావాల్సిన రూ.80 వేల కోట్ల కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా కూడా విభజన హామీలు ఇంకా అమలు కాలేదని పేర్కొన్నారు.


తిరుపతి లడ్డూ అంశాన్ని రాజకీయం చేయొద్దు..

విభజన వల్ల ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడటానికి సుప్రీంకోర్టులో ఓ అడ్వొకేట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. తిరుపతి లడ్డూ అంశాన్ని రాజకీయం చేయటం మంచిది కాదన్నారు. లడ్డూ కల్తీ చేసిన వారిపై సిట్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న హెరిటేజ్, భారతి సిమెంట్స్ ప్రధాన కార్యాలయాలను అమరావతికి తీసుకురావాలని సూచించారు. వైసీపీ తరహాలోనే కూటమి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యలకు వెళ్లకూడదని హితవు పలికారు. చంద్రబాబును జైల్లో పెట్టడం వల్ల జగన్‌కు నష్టమే జరిగిందని.. వైసీపీ నేతలను జైల్లో పెడితే చంద్రబాబుకు కూడా నష్టమే జరుగుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను ఇబ్బందులకు గురి చేయటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది.. మంత్రుల ధ్వజం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 04:26 PM