Share News

ఇంజనీరు మరణ శాసనం!

ABN , Publish Date - Aug 18 , 2026 | 08:45 AM

ఎంత ఆవేదన కలిగిందో తెలియదుగానీ మొత్తం కుటుంబానికే మరణ శాసనం రాశాడు ఆ ఇంజనీరు. రెండేళ్లలో ఏఈగా ఉద్యోగ విరమణ పొంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా సాగించాల్సిన వయసులో.. గోదావరిలో దూకారు.

ఇంజనీరు మరణ శాసనం!

  • కుటుంబం సహా గోదావరిలో దూకిన పిఠాపురం ఏఈ

  • నూకరాజు మృతదేహం వెలికితీసిన మత్స్యకారులు

  • భార్య, కుమార్తెల కోసం తీవ్రంగా గాలింపు

  • ఈత రావడంతో మనవడు సురక్షితంగా ఒడ్డుకు..

  • కాకినాడ నుంచి కారులో నలుగురూ రాజమండ్రికి..

  • రోడ్‌ కం బ్రిడ్జి వద్ద ఒకర్ని ఒకరు పట్టుకుని నదిలోకి..

  • ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌.. సాదిక్‌ అనే వ్యక్తి

  • వేధిస్తున్నాడని ఆ నోట్‌లో వాపోయిన నూకరాజు

  • కుటుంబంతో సహా గోదావరిలో దూకిన పిఠాపురం ఏఈ.. నూకరాజు మృతదేహాన్ని వెలికితీసిన మత్స్యకారులు

రాజమహేంద్రవరం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఎంత ఆవేదన కలిగిందో తెలియదుగానీ మొత్తం కుటుంబానికే మరణ శాసనం రాశాడు ఆ ఇంజనీరు. రెండేళ్లలో ఏఈగా ఉద్యోగ విరమణ పొంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా సాగించాల్సిన వయసులో.. గోదావరిలో దూకారు. గల్లంతయినవారిలో టెల్లపూడి నూకరాజు(60) మృతదేహం లభించింది. ఆయన భార్య మీనా(61), కూతు రు కొవ్వూరి సౌజన్య కోసం ఐదు పడవల్లో మత్స్యకారులు గాలిస్తున్నారు. ఈత రావడం తో మనవడు రియాన్స్‌ కార్తికేయరెడ్డి బయటపడ్డాడు. ఆ వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచాయతీరాజ్‌శాఖలో మండల ఇంజనీరుగా నూకరాజు పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి కారులో భార్య మీనా, కూతురు సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డితో కలిసి రాజమహేంద్రవరం వచ్చారు. కారు డ్రైవరుకు డబ్బులిచ్చి కాకినాడ పంపేశారు. సౌజన్య డ్రైవ్‌ చేస్తుండగా కొవ్వూరు వెళ్లారు.


అక్కడ ఓ హోటల్‌ దగ్గర ఇడ్లీ పార్సిల్‌ చేయించుకుని.. రోడ్‌ కం రైలు బ్రిడ్జిపైకి వచ్చి 80 ఎల్‌ ఎలక్ట్రికల్‌ పోల్‌ సమీపంలో రాత్రి 11 గంటల సమయంలో ఆగారు. తమతో తెచ్చుకున్న టిఫిన్‌లో రెండు ప్లేట్ల ఇడ్లీ తిని గోదావరిలో దూకేశారు. ముందుగా నూకరాజు, మీనా దూకేయగా, కార్తికేయ చేయి పట్టుకొని సౌజన్య దూకుతుండగా.. చొక్కాకు బ్రిడ్జి రెయిలింగ్‌ ఊచ తగలడంతో అమ్మ చేయి నుంచి విడివడి... గోదావరిలో పడ్డాడు. కార్తికేయకు ఈత వచ్చు. దీంతో ఈదుకుంటూ దగ్గరలోని ఇసుక తిప్ప వద్దకు చేరుకొని.. కేకలు వేశాడు. బీట్‌ పోలీసులు, మత్స్యకారులు.. బాలుడిని ఒడ్డుకు చేర్చారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో దోబీఘాట్‌-ఎదుర్లమ్మలంక మధ్యలో తేలిన నూకరాజు మృతదేహా న్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు.


మరణ వాంగ్మూలంలో..

నూకరాజు తన ఆత్మహత్యకు ముందు ఓ కాగితంపై తమ చావుకు ఎవరు కారణమో రాసి వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేశారు. కలెక్టరు, ఎస్పీలను ఉద్దేశించి ఉన్న ఈ మరణ వాంగ్మూలంలో ఏముందంటే.. ‘‘నా అల్లుడు గత నెల 2న మరణించాడు. మా అమ్మాయికి సాయంగా ఉంటానని ప్రొషూటింగ్‌ అకాడమీ ఆర్గజైజర్‌ సాదిక్‌ఖాన్‌ ముందుకొచ్చాడు. మేం అంగీకరించలేదు. దీంతో సౌజన్యను వేధించడం మొదలుపెట్టాడు. మనవ డు కార్తీక్‌ రెడ్డిని చంపేస్తానని బెదిరించి ఆమెను లొంగదీసుకొన్నాడు. విలువైన వస్తువులు, బ్యాంక్‌ ఖాతాలను లాగేసుకున్నాడు. మా అమ్మాయి ని చిత్రహింసలు పెడుతున్నాడు. అతని వేధింపులు తట్టుకోలేకే నేను, నా భార్య మీనా, కూతురు సౌజన్య, మనవడు కార్తికేయ ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఆ కసాయి, దుర్మార్గుడిని శిక్షించవలసినదిగా కోరుచున్నాం. ఈ దుర్మార్గుడు ఒలింపిక్స్‌ కోచ్‌గా కూడా ఎంపికయ్యాడు’’ అని రాసి సంతకం చేశారు. కాగా, అమ్మను తన కోచ్‌ సాదిక్‌ వేధిస్తున్నాడని, గత 3 రోజులుగా కొడుతున్నాడని, దీంతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు బాలుడు స్థానిక మత్స్యకారులకు చెప్పినట్టు చెబుతున్నారు. సాదిక్‌ని అదుపులోకి తీసుకోడానికి పోలీసు బృందం రాజమహేంద్రవరం నుంచి వెళ్లారు. అయితే అప్పటికే నూకరాజు వాట్సాప్‌లో పెట్టిన మరణ వాంగ్మూలం ఆ సాదిక్‌కి చేరి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.


పవన్‌ కల్యాణ్‌ తీవ్ర విచారం

ఏఈ నూకరాజు మరణంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


వార్తలు కూడా చదవండి...

నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 08:45 AM