కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో పేలుళ్లు.. పెరిగిన మృతుల సంఖ్య
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:52 PM
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా వివరాల ప్రకారం..
కాకినాడ జిల్లా, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఇవాళ(శనివారం) భారీ పేలుడు (Kakinada District Firework Explosion) సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కి చేరింది. ఈ విషాదకర ఘటన సమయంలో బాణసంచా కేంద్రంలో సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
విషమంగా మరికొందరి పరిస్థితి..
గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించగా, వారిలో కొందరిని కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న ఇద్దరు క్షతగాత్రులు కూడా మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 23కి పెరిగింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అధికారుల దర్యాప్తు..
ఈ ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బాణసంచా తయారీ కేంద్రంలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. తయారీ కేంద్రంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో వేట్లపాలెం గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి ..
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తగిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బాణసంచా తయారీ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News