బొప్పాయి పంటకు బ్లాస్టింగ్ దెబ్బ
ABN , Publish Date - Jul 09 , 2026 | 01:03 PM
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని బొమ్మవరం రెవెన్యూ పరిధిలో ఉన్న ఓప్రైవేటు మైన్స్ అనుమతి లేని బ్లాస్టింగ్ చేస్తూ రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోందనే విమర్శలొస్తున్నాయి.
రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు మైనింగ్
రాళ్ల వల్ల దెబ్బతిన్న పంట
పట్టించుకోని అధికారులు
ఓబులవారిపల్లె(తిరుపతి): తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని బొమ్మవరం రెవెన్యూ పరిధిలో ఉన్న ఓప్రైవేటు మైన్స్ అనుమతి లేని బ్లాస్టింగ్ చేస్తూ రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మంగళంపల్లెకు చెందిన కాకర్ల రెడ్డయ్య తదితర రైతులు వాపోతున్నారు. బొమ్మవరం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబరు 44లో మంగళంపల్లె గ్రామానికి అతి సమీపంలో ఒక గుట్ట ఉంది. అది మంగంపేట- చిట్వేలి రోడ్డు నుంచి బొమ్మవరం గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డుకు ఆనుకుని పొలాల ప్రాంతంలో ఉంది.
దీనికి బీఆర్ మైన్స్‌వారు మైనింగ్ అనుమతులు పొందినట్లు చెబుతున్నారు. దీనిలో ఉన్న ఖనిజాన్ని మిషన్ ఉపయోగించి తీసుకోవాలి. అయితే గనులశాఖ నియమ నిబంధనలు ఉల్లంఘించి బ్లాస్టింగ్ చేస్తున్నారు. పేలుడు పదార్థాలు ఉపయోగించి బ్లాస్టింగ్ చేయడం ద్వారా రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న రైతుల బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. అలాగే చెట్లకు ఉన్న కాయలు సైతం తెగి పడిపోయాయి. బ్లాస్టింగ్ దాటికి లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేసిన బొప్పాయి పంట నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మైనింగ్ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన అదికారులు నిద్రమత్తులో ఉన్నారని ఆరోపణలు చేశారు రైతుల పంటలకు నష్టం చేస్తూ గ్రామస్తులకు ఇబ్బందులను కలిగించే ఈ అక్రమ మైనింగ్‌ను జిల్లాస్థాయి అధికారులు చర్యలు తీసుకొని తక్షణమే రద్దు చేయాలని మంగళంపల్లె, బోటుమీదపల్లె గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు ఉన్న సమయంలో బ్లాస్టింగ్ వల్ల రాళ్లు పడి మృతిచెందితే బాధ్యత ఎవరు వహిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇక నుంచి మీ సంగతి చూస్తాం... కొడాలి నానికి బుద్దా వెంకన్న వార్నింగ్
యూట్యూబర్ జోసఫ్ రావణ్ బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News