తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి
ABN , Publish Date - May 23 , 2026 | 11:11 AM
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీని సమన్వయ సమస్య వేధిస్తోంది.
కొత్త ఎమ్మెల్యేల తడబాట్లతో ఇబ్బందులు
సైలెంట్‌గా సీనియర్ అమరనాథ రెడ్డి
సమన్వయం చేసుకోలేకపోతున్న ఎంపీ
అధ్యక్ష, కార్యదర్శులూ అంతంతమాత్రం
చిత్తూరు: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీని సమన్వయ సమస్య వేధిస్తోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు కొత్తవారు కావడం,కొంతమంది వైసీపీ నాయకుల్ని పక్కన పెట్టుకోవడంతో నియోజకవర్గాల్లో గ్రూపులు పెరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధిష్ఠానం ఈ విషయమై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
సీఎం నియోజకవర్గమైన కుప్పంలో ముగ్గురు నాయకుల మధ్య సఖ్యత లేదు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ వేదిక మీద పక్కపక్కనే కూర్చున్నా.. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడంలో మాత్రం దూరదూరంగానే ఉంటున్నారు. ఎవరి వర్గం వారిదే అయిపోయింది. సీఎం కుప్పం వచ్చిన ప్రతిసారీ, అమరావతిలో కుప్పం నాయకులతో సమావేశమైన ప్రతిసారీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ‘మీ మధ్య సమన్వయం లేదు, మీరు మీరు కీచులాడుకుంటే కార్యకర్తల పరిస్థితి ఏంటి’అని మందలిస్తూనే ఉన్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
జిల్లాలో సీనియర్ నేత అయిన అమరనాథ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశపడ్డారు.ఆ ప్రభావం పార్టీపై బాగానే పడింది.చంద్రబాబు పలుమార్లు సూచించినా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఆయన జోక్యం చేసుకుని సమస్యల్ని పరిష్కరించడం జరగలేదు.ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు తన పరిధిలోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవడంలో వెనకబడుతున్నారు. ఇటీవల చిత్తూరులో ఓ ఆర్పీ సీఎంను దూషించిందనే కారణంగా కొంతమంది తెలుగు మహిళలు ఆమెతో దురుసుగా ప్రవర్తించారు.ఈ విషయం తెలుసుకున్న ఎంపీ నేరుగా ఆ 12 మంది మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారు.
తనకు చెప్పకుండా ఇదంతా చేశారంటూ అలిగిన చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గన్‌మెన్లను సరెండర్ చేసి తన నిరసన ప్రకటించారు.ఇదంతా పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో అధిష్ఠానం ఇద్దర్నీ మందలించింది.మరో ఎమ్మెల్యే థామస్ ‘ఎస్సీలు రాజకీయంగా ఎదగకూడదా అంటూ ఎస్‌ఆర్‌పురంలో.. పక్క నియోజకవర్గాల్లో అవినీతి జరగడం లేదా’ అని చిత్తూరులో చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇరుకున పెట్టాయి.
టీడీపీ పార్లమెంటు అధ్యక్ష కార్యదర్శులు షణ్ముగరెడ్డి, సునీల్‌కుమార్ పార్టీ వ్యవహారాలపై ప్రభావం చూపలేకపోతున్నారు. సీనియర్లను కలుపుకుని వెళ్లడంలో, కార్యకర్తల సమస్యల పరిష్కారంలో, నియోజకవర్గాల్లో సమస్యల్ని పరిష్కరించడంలో వీరి ముద్ర ఇంకా పడలేదు.స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న పరిస్థితుల్లో పార్టీ నాయకులందరినీ కలుపుకుని ముందుకు తీసుకుపోయే సమర్థుడైన నాయకుడిని అధిష్ఠానం ముందుకు తీసుకురావాల్సిన అవసరముంది.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ రేట్స్.. రెండో రోజూ పతనం
రౌడీ బ్రదర్స్‌పై పీడీ యాక్ట్: సీపీ వీసీ సజ్జనార్
Read Latest AP News And Telangana News And International News And Telugu News