Share News

మినరల్‌ పేరుతో మోసం..యథేచ్ఛగా తాగునీటి దందా

ABN , Publish Date - May 23 , 2026 | 10:16 AM

మినరల్‌ వాటర్‌ పేరుతో తాగునీటి విక్రయాలు యఽథేచ్ఛగా జరుగుతున్నాయి.

మినరల్‌ పేరుతో మోసం..యథేచ్ఛగా తాగునీటి దందా
Illegal water plants

  • అనుమతి లేకుండా నీటిశుద్ధి, సరఫరా

  • నాణ్యత, శుభ్రత పట్టించుకోని వ్యాపారులు

  • ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం

  • చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

హైదరాబాద్: మినరల్‌ వాటర్‌ పేరుతో తాగునీటి విక్రయాలు యఽథేచ్ఛగా జరుగుతున్నాయి. కొందరు అనుమతులు లేకుండానే ‘శుద్ధి’ నీటిని విక్రయిస్తున్నారని, ఇంకొందరు నీటి నాణ్యత, శుభ్రతను పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. అధికారులు కూడా ఇలాంటి నీటి శుద్ధి కేంద్రాలను చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో నాణ్యతలేని నీరు బబుల్స్‌(25 లీటర్ల పారదర్శక క్యాన్‌)లో చలామణి అవుతోంది. అల్లాపూర్‌, మోతీనగర్‌, సఫ్దర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో మినరల్‌వాటర్‌ ప్లాంట్లు వెలిశాయి. వాటిల్లో కొన్ని ప్లాంట్లు అనుమతులు తీసుకోకుండా, నాణ్యతాప్రమాణాలు పాటించకుండా గుట్టుచప్పుడు కాకుండా నడిపించేస్తున్నారు. కొన్నైతే నాలాల వెంట వెలిశాయి.


నాణ్యత ప్రమాణాలు గాలికి..

అల్లాపూర్‌, బోరబండ, మాదాపూర్‌, మోతీనగర్లలో కొన్నేళ్లుగా నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి అల్లాపూర్‌ డివిజన్‌ పరిసరాల్లో సున్నంచెరువు(ప్రస్తుతం ఎండిపోయింది), మైసమ్మచెరువు, కామునిచెరువులు ఉండటం, అందునా సున్నంచెరువు, కామునిచెరువు సమీపంలో బోర్లు వేసుకుని నీటిశుద్ధి కేంద్రాలు వెలిశాయి. ఇక్కడ శుద్ధిచేసిన నీరు సామాన్య ప్రజల ఇళ్లకే కాకుండా హైటెక్‌ సిటీలోని కంపెనీలకు కూడా సప్లై అవుతుండడం గమనార్హం. ఆటోట్రాలీలు, వ్యాన్ల ద్వారా నిత్యం గృహాలు, వ్యాపారకేంద్రాలు,


ప్రభుత్వ-ప్రైవేటు కార్యాలయాలు, కూల్‌డ్రింక్‌ దుకాణాలకు 20లీటర్ల బబుల్స్‌ను సరఫరా చేస్తున్నారు. దుకాణాలకైతే 20లీటర్ల క్యాను రూ.15 నుంచి 20, గృహాలకైతే రూ.20నుంచి రూ.25 దాకా విక్రయిస్తున్నారు. శుద్ధినీటి తయారీదార్ల సంస్థ పేరు, ఐఎస్ఐ గుర్తింపు నెంబరు లాంటివి ముద్రించకుండానే వాటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి ప్లాంట్‌లోనే ల్యాబ్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరీక్షించాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకపోగా కనీసం బబుల్స్‌కు సీళ్లు కూడా సరిగ్గా వేయకుండా వాటిని విక్రయిస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి.


క్యాన్లు అపరిశుభ్రం..

నీటి సరఫరాకు వినియోగించే బబుళ్లను(క్యాన్లను) కడగటం లేదని, కొన్ని సందర్భాల్లో పాచిపట్టి అపరిశుభ్రంగా ఉంటున్నాయని, దీని వల్ల వినియోగదార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే కొందరు వ్యాపారులు నీటిలో నాణ్యత, శుభ్రత పాటించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.


city5.2.jpgకామునిచెరువు నీళ్లలో కాలుష్యం స్థాయిలు ప్రమాదకరం

హైటెక్‌ సిటీకి సమీపంలో ఉన్న కామునిచెరువు పరిసరాల్లో అక్రమంగా బోర్లువేసి చెరువునీటిని ఆఫీసులు, విద్యాసంస్థలకు సరఫరా చేస్తుండడం ఇటీవల చర్చనీయాంశమైంది. కామునిచెరువు నీళ్లలో కాలుష్యం స్థాయిలు ప్రమాదకరంగా మారాయి. హైడ్రా సున్నంచెరువు ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపట్టడంతో ఇటీవల చెరువులో నీళ్లు లేకుండాపోయాయి. కాముని చెరువులో గతంలో అక్రమ బోర్లను తొలగించడం పట్ల స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.


కలుషిత నీటి సరఫరా..

జలమండలి సరఫరా చేస్తున్న నీటిని అధిక శాతం ప్రజలు నేరుగా తాగడం లేదు. ఇందుకు కారణం అడపాదడపా భూగర్భ పైపులైన్ల లీకేజీలు, డ్రైనేజీ నీటితో కలిసి కలుషితమవడం. ఈ విషయమై జలమండలి అధికారులను సంప్రదిస్తే.. ఏదేని సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని.. పరిశీలించి వెంటనే తగుచర్యలు చేపడతామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం అక్రమ వాటర్‌ ప్లాంట్ల తనిఖీ, నీటి నాణ్యత, ప్రజాఆరోగ్యం అంశాల్లో తమ అజమాయిషీ ఉండాలని, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునేవారి భరతం పట్టాలని పలువురు కోరుకుంటున్నారు.


సున్నంచెరువులో మురుగునీరు కలవకుండా చేయాలి

రాక్‌గార్డెన్‌ పార్కులోని బోరు ఎక్కువ లోతు వేయకపోవడంతో అది ఒట్టిపోయి నీళ్లొచ్చేవి కాదు. హైడ్రా గతంలో అక్రమ బోర్లను పెకిలించటం వంటి పరిణామాలతో ఈ పార్కులోని బోరులో నీళ్లు బాగా వచ్చాయి. సున్నంచెరువు ప్రక్షాళన, సుందరీకరణతో పరిస్థితి ఇప్పుడే కొంత మెరుగుపడింది. చెరువులో మురుగు కలవనీయకుండా చేసి, కేవలం వర్షపు నీరుతో అది నిండితే మా పరిసర కాలనీలంతా ట్యాంకర్లమీద ఆధారపకుండా ఉండొచ్చు.

  • కృష్ణారావు, గాయత్రినగర్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ ధరల ర్యాలీకి బ్రేక్.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

రౌడీ బ్రదర్స్‌పై పీడీ యాక్ట్‌: సీపీ వీసీ సజ్జనార్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 23 , 2026 | 10:20 AM