Share News

శిక్షించినా వినడం లేదు..

ABN , Publish Date - Sep 26 , 2026 | 09:44 AM

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

శిక్షించినా వినడం లేదు..
Drunken driving

  • జిల్లాలో పెరుగుతున్న డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

  • నిందితులకు జైలుశిక్ష

  • పద్ధతి మార్చుకోని వాహనదారులు

జిల్లాలో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పెరుగుతున్నాయి. నిందితులకు న్యాయస్థానం జైలుశిక్ష విధిస్తున్నా వాహనదారులు పద్ధతి మార్చుకోవడం లేదు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. పైగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.

మదనపల్లె(అన్నమయ్య): అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యాక్సిడెంట్‌ జోన్లు, బ్లాక్‌ స్పాట్లు, మలుపులు, ఘాట్‌ రోడ్లలో ప్రమాద హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనదారుల్లో చైతన్యం నింపేలా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. హైవే, ప్రధాన రహదారుల్లో నాకాబందీ, వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. బ్రీత్‌ ఎనలైజర్‌, గంజాయి కిట్లతో పరీక్షలు చేస్తున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తున్నారు. న్యాయస్థానం దోషులకు శిక్ష అమలు చేస్తోంది. వారం, పది రోజులు జైలుశిక్ష అనుభవించడంతో పాటు జరిమానా సైతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆదివారం ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మదనపల్లెలో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటోంది.


న్యాయస్థానం విధించిన శిక్షలు..

1) ఆగస్టు 27న మదనపల్లెలోని నక్కలదిన్నెతాండాకు చెందిన బి.రాజశేఖర్‌నాయక్‌ మద్యం మత్తులో బైక్‌ నడుపుతూ టూటౌన్‌ పోలీసులకు పట్టుబడటంతో కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రెండు రోజులు జైలు, రూ.11వేలు జరిమానా విధించింది.

2) ఆగస్టు 31న మదనపల్లె మండలం బాలాజీనగర్‌కు చెందిన కె.గోవర్ధన్‌ డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడటంతో టూటౌన్‌ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రెండు రోజులు జైలు, రూ.11వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

3) సెప్టెంబరు 10న నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన సతీ్‌షకుమార్‌రెడ్డి మద్యం మత్తులో బైక్‌ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా నాలుగు రోజులు జైలు, రూ.11వేలు జరిమానా విధించింది.

4) తాజాగా మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తి గంజాయి మత్తులో కారు నడుపుతూ తాలూకా పోలీసులకు పట్టుబడటంతో కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. నాలుగు రోజులు జైలు, రూ.11వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.


dri1.2.jpgజరిమానా కోసం తిప్పలు..

కోర్టు విధించే జరిమానా చెల్లించేందుకు నిందితులు అనేక తిప్పలు పడుతున్నారు. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంజాయి, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో పట్టుబడిన నిందితులకు గతంలో జైలుశిక్ష, పెద్దమొత్తంలో జరిమానా ఉండేవి కావు. కోర్టు రూ.300 నుంచి రూ.500 వరకు జరిమానా విధించి విడుదల చేసేది. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య, రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడంతో న్యాయస్థానం శిక్షలు అమలు చేస్తోంది. రూ.11వేలు చొప్పున జరిమానా విధిస్తుండటంతో నిందితుల్లో దడ మొదలైంది. చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరిగా బంగారు నగలు తాకట్టు పెట్టి లేదా వడ్డీకి తీసుకుని జరిమానా చెల్లించే పరిస్థితి ఎదురైంది.


ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు

గంజాయి, మద్యం కేసుల్లో పట్టుబడిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిందితులపై కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తున్నాం. న్యాయస్థానం జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తోంది.జిల్లాలో నాకాబందీ, వాహన తనిఖీలను ముమ్మరం చేశాం. పట్టుబడిన వారిపై కేసులు నమో దు చేస్తున్నాం.

  • ధీరజ్‌, ఎస్పీ


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 09:44 AM