ట్రంప్‌నకు ఇరాన్ కీలక ప్రతిపాదన.. ఏడు రోజుల కాల్పుల విరమణకు రెడీ
ABN , Publish Date - Sep 26 , 2026 | 09:20 AM
అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏడు రోజుల కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రతిపాదన చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏడు రోజుల కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రతిపాదన చేసింది. అయితే, ఈ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
అమెరికా తమ డిమాండ్లకు అంగీకరిస్తే వ్యూహాత్మక జలమార్గమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని టెహ్రాన్ ప్రతిపాదించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన పోరాటాన్ని ఏడు రోజుల్లోగా ముగిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి శుక్రవారం ఐక్యరాజ్యసమితి వద్ద విలేకరులతో మాట్లాడారు. అమెరికా తమ షరతులను అంగీకరిస్తే ఏడు రోజుల్లో హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, సాధారణ నౌకాయానాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
ఇరాన్ బలవంతాన్ని, బెదిరింపులను, భయపెట్టే చర్యలను అంగీకరించదని, ఒత్తిడికి లొంగి తన సార్వభౌమ హక్కులను వదులుకోదని అరాఘ్చి స్పష్టం చేశారు. 'ఇప్పుడు నిర్ణయం అమెరికా చేతిలో ఉంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే చిత్తశుద్ధి అమెరికాకు ఉంటే, అందుకు అవసరమైనవన్నీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి' అని ఆయన పేర్కొన్నారు. అబ్బాస్ అరాఘ్చి మాట్లాడిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రతిపాదన గత ఒప్పందాన్ని పోలి ఉండటం, ఇరాన్ తన హామీలను అమలు చేస్తుందా? అనే విషయంలో ట్రంప్‌నకు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్‌పై చమురు ఆంక్షలను సడలించడం, లెబనాన్‌ను కాల్పుల విరమణ పరిధిలోకి తీసుకురావడం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను పునఃప్రారంభించడం వంటి ప్రతిపాదనలను అమెరికా ముందు ఇరాన్ ఉంచినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
కీవ్‌పై రష్యా డ్రోన్ దాడులు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
కూలిన విమానం.. ఇద్దరు లెఫ్టినెంట్ జనరల్స్ సహా 14 మంది మృతి