కీవ్‌పై రష్యా డ్రోన్ దాడులు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
ABN , Publish Date - Sep 26 , 2026 | 07:52 AM
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శుక్రవారం నాడు రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఐదుగురు మరణించగా.. 27 మంది గాయపడ్డారు. అమెరికా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ భాగస్వామికి చెందిన గిడ్డంగిపైనా దాడులు జరిగాయి.
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శుక్రవారం నాడు రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఐదుగురు మరణించగా.. 27 మంది గాయపడ్డారు. అమెరికా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ భాగస్వామికి చెందిన గిడ్డంగిపైనా దాడులు జరిగాయి. దీంతో ఆ భవనం పొగతో నిండిపోయి, మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.
కీవ్‌లోని బ్రోవరీ జిల్లాలో ఉన్న మెక్‌డొనాల్డ్స్ భాగస్వామి గోదాముపై రష్యా డ్రోన్లు రెండుసార్లు దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్ రీజినల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి తైమూర్ తకాచెంకో ప్రకారం.. మొదటి దాడి శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జరిగింది. అనంతరం అదే గోదాముపై సాయంత్రం వేళ మరోసారి దాడి జరిగింది. రెండో దాడి తర్వాత గిడ్డంగిలో భారీగా మంటలు చెలరేగాయి. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులను నిల్వ చేసే విభాగం పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు కీవ్ రీజినల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు. ఉక్రెయిన్‌లో పౌర మౌలిక సదుపాయాలు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా విస్తృత దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ భాగస్వామికి చెందిన గోదాముపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. ‘సాధారణ ఆహారంపై దాడి చేసే డ్రోన్’ అంటూ జెలెన్‌స్కీ తన టెలిగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు, రష్యా నిన్నటి డ్రోన్ దాడుల్లో మొత్తం ఐదుగురు మృతిచెందగా.. 27 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. గోదాముతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నష్టంపైనా అధికారులు వివరాలు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అఫ్ఘాన్‌పై పాక్ భారీ వైమానిక దాడులు
కూలిన విమానం.. ఇద్దరు లెఫ్టినెంట్ జనరల్స్ సహా 14 మంది మృతి