కూలిన విమానం.. ఇద్దరు లెఫ్టినెంట్ జనరల్స్ సహా 14 మంది మృతి
ABN , Publish Date - Sep 26 , 2026 | 07:31 AM
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు వెళ్తున్న ఓ విమానం కేంజ్ ప్రాంతంలో కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు వెళ్తున్న ఓ విమానం కేంజ్ ప్రాంతంలో కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సైనిక న్యాయస్థానం అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండె, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
అయితే.. విమానంలో సాంకేతిక లోపం తలతెత్తిందని, ఆ తర్వాతే కేంజ్ ప్రాంతంలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు ఏమిటనే దానిపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
కాగా.. ఈస్ట్ కాంగోలో సైన్యం పలు తిరుగుబాటు సమూహాలతో పోరాడుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రువాండా మద్దతుందని కాంగో ఆరోపిస్తున్న M23 తిరుగుబాటు దళాలతో అక్కడ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో తిరుగుబాటు దళాల దాడులు తీవ్రతరం కావడంతో ఈస్ట్ కాంగోలోని పలు ముఖ్య నగరాలు వారి ఆధీనంలోకి వెళ్లినట్లు సమాచారం.
ఇవీ చదవండి:
అఫ్ఘాన్‌పై పాక్ భారీ వైమానిక దాడులు
ఎన్‌ఐఏ కేసులో అమెరికా పౌరుడికి బెయిల్