Share News

ఎన్‌ఐఏ కేసులో అమెరికా పౌరుడికి బెయిల్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:47 AM

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నమోదు చేసిన కేసులో అరెస్టయిన అమెరికా పౌరుడు మాథ్యూ ఆరోన్‌ వాన్‌ డైక్‌, ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులు 30 రోజుల పాటు తమ స్వదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు అనుమతించింది.

ఎన్‌ఐఏ కేసులో అమెరికా పౌరుడికి బెయిల్‌
mathew

  • 30 రోజులు స్వదేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నమోదు చేసిన కేసులో అరెస్టయిన అమెరికా పౌరుడు మాథ్యూ ఆరోన్‌ వాన్‌ డైక్‌, ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులు 30 రోజుల పాటు తమ స్వదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు అనుమతించింది. తమ కుటుంబాలను కలుసుకోవడానికి వీలుగా ఈ ఏడుగురి పాస్‌పోర్టులను వారికి అందించాలని న్యాయాధికారి ప్రశాంత్‌ శర్మ ఆదేశించారు. డిఫాల్ట్‌ బెయిల్‌ పొందిన వీరంతా తీహాడ్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. విమానం ఎక్కిన తేదీ నుంచి నెల రోజుల పాటు విదేశాల్లో ఉండేందుకు వారికి అనుమతి లభించింది. గడువు ముగిసిన తర్వాత వారు తిరిగి భారత్‌ రావాలని, వచ్చిన 72 గంటల్లోగా తమకు సమాచారం అందించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 13న వాన్‌ డైక్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో, ఢిల్లీ, లఖ్‌నవూ ఎయిర్‌పోర్టుల్లో ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్‌ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం, నివసించడం వంటి ఆరోపణలతో వారిపై చార్జిషీట్‌ దాఖలు చేసింది.

Updated Date - Sep 26 , 2026 | 03:53 AM