హోర్ముజ్‌లో అమెరికా లేజర్ ఆయుధాలు
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:40 AM
దూసుకొచ్చే క్రూయిజ్ క్షిపణులు, శత్రు డ్రోన్లను కూల్చేసేందుకు అమెరికా అత్యంత శక్తిమంతమైన (హైఎనర్జీ) లేజర్ ఆయుధాలను హోర్ముజ్ జలసంధిలో మోహరిస్తోంది!
‘ఎక్స్ బాక్స్ గేమ్ కన్సోల్ కంట్రోలర్ల’తో శత్రు డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల కూల్చివేత
న్యూయార్క్, సెప్టెంబరు 25: దూసుకొచ్చే క్రూయిజ్ క్షిపణులు, శత్రు డ్రోన్లను కూల్చేసేందుకు అమెరికా అత్యంత శక్తిమంతమైన (హైఎనర్జీ) లేజర్ ఆయుధాలను హోర్ముజ్ జలసంధిలో మోహరిస్తోంది! ఈ లేజర్ ఆయుధాలను ప్రయోగించడానికి అమెరికన్ సైనికులు ఉపయోగిస్తున్న పరికరాలేంటో తెలుసా? పిల్లలు ఆడుకునే ఎక్స్‌బాక్స్ గేమ్ కన్సోల్ కంట్రోలర్లు. లేజర్ ఆయుధాలను ప్రయోగించే విధంగా అమెరికా ఆయుధ విభాగం వాటిలో మార్పుచేర్పులు చేసి పశ్చిమాసియాలోని తమ సైనికులకు అందజేస్తోంది. క్షిపణుల వంటి ఖరీదైన ఆయుధాలకు బదులు.. వారు ఈ లేజర్ ఆయుధాలను ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో శత్రు డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను కూల్చేస్తున్నట్టు ‘న్యూయార్క్ పోస్ట్’ వార్తా సంస్థ ఒక కథనంలో వివరించింది. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు అమెరికా 50 ఏళ్లకు పైగా కృషి చేస్తోంది. ఇప్పటికే దీనిపై 500 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.4,800 కోట్లకు) పైగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. ‘‘ఈ లేజర్ ఆయుధాలతో.. శత్రు డ్రోన్లను నిర్దిష్టంగా ట్రాక్ చేసి, కూల్చేయవచ్చు. లేజర్ కిరణాలను గురిపెట్టి డ్రోన్‌ను నిర్వీర్యం చేయవచ్చు. లేదా మొత్తానికే దాన్ని నాశనం చేయొచ్చు’’ అని ‘డైరెక్టెడ్ ఎనర్జీ కన్సల్టెంట్స్’ ప్రెసిడెంట్ మార్క్ నీస్ తెలిపారు. నిజానికి అమెరికా ఇప్పటికే వీటిని.. మెక్సికో సరిహద్దుల్లో మోహరించి, ఆ దేశానికి చెందిన వ్యవస్థీకృత మాదకద్రవ్య ముఠాలు ప్రయోగించే డ్రగ్స్ డ్రోన్లను కూల్చేయడానికి వినియోగిస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియాలోనూ యుద్ధనౌకలపై ఈ లేజర్ ఆయుధాలను మోహరిస్తోంది. కాకపోతే.. ఇప్పటివరకూ వీటిని మానవ లక్ష్యాలపై ఎప్పుడూ గురిపెట్టలేదు. కాగా.. ఈ లేజర్ ఆయుధాలు ప్రభావవంతంగా పనిచేయాలంటే అందుకు ఆకాశం నిర్మలంగా ఉండడం అవసరం. పొగమంచు, ధూళి ఉన్నా.. వర్షం, మంచు పడుతున్నా లేజర్ కాంతి ఆ కణాలపై పడి చెదిరిపోతుంది.
దీనివల్ల లక్ష్యాన్ని చేరే సరికి లేజర్ కిరణాల తీవ్రత తగ్గిపోతుంది. అలాగే.. డ్రోన్ల సమూహాలు పెద్ద ఎత్తున దూసుకొస్తున్నప్పుడు లేజర్ ఆయుధాల ప్రయోగం కష్టం. ఎందుకంటే.. ఒక డ్రోన్‌ను కూల్చాలంటే దానిపై లేజర్ కిరణాలను లాక్ చేసి, కూల్చేయడానికి 2 నుంచి 7 సెకన్లపాటు ప్రసరింపజేయాలి. ఫలితంగా ఎక్కువ డ్రోన్లను లక్ష్యంగా చేసుకోవడం కష్టమవుతుంది. అలాంటి సందర్భాల్లో సంప్రదాయ వ్యవస్థలపైనే ఆధారపడక తప్పదు.
ఈ వార్తలు కూడా చదవండి
ఇటలీ స్కూళ్లలో బురఖాను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన కానుక.. మూడు అడుగుల బాల్డ్ ఈగల్ శిల్పం బహూకరణ