Share News

జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన కానుక.. మూడు అడుగుల బాల్డ్ ఈగిల్ శిల్పం బహూకరణ

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:21 AM

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుదైన కానుక అందించారు. వైట్‌హౌస్‌లో గురువారం జరిగిన స్టేట్ డిన్నర్ సందర్భంగా సుమారు మూడు అడుగుల ఎత్తైన బాల్డ్ ఈగిల్ శిల్పాన్ని జిన్‌పింగ్‌కు ట్రంప్ బహూకరించారు.

జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన కానుక.. మూడు అడుగుల బాల్డ్ ఈగిల్ శిల్పం బహూకరణ
Donald Trump Gift

వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుదైన కానుక అందించారు. వైట్‌హౌస్‌లో గురువారం జరిగిన స్టేట్ డిన్నర్ సందర్భంగా సుమారు మూడు అడుగుల ఎత్తైన బాల్డ్ ఈగిల్ శిల్పాన్ని జిన్‌పింగ్‌కు ట్రంప్ బహూకరించారు. అమెరికా జాతీయ చిహ్నమైన బాల్డ్ ఈగిల్‌ను ప్రతిబింబించేలా తమ దేశ కళాకారుడు ఈ శిల్పాన్ని రూపొందించారని ట్రంప్ తెలిపారు. ఈ రూపకల్పనలో తాను, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా భాగస్వాములయ్యామని చెప్పారు. అమెరికా స్వేచ్ఛా, ఉన్నత ఆశయాలకు ఈగిల్ ప్రతీకగా నిలుస్తుందని, ఈ శిల్పానికి బీజింగ్‌లో మంచి స్థానం దొరుకుతుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


జిన్‌పింగ్ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో కీలక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI) సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ చర్చలు నిజాయితీగా, లోతుగా సాగాయని.. పలు అంశాల్లో ఉమ్మడి అవగాహనకు వచ్చినట్లు జిన్‌పింగ్ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా-చైనా స్నేహానికి ప్రతీకగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు. ‘పింగ్ పింగ్’, ‘ఫు షువాంగ్’ అనే రెండు జెయింట్ పాండాలను త్వరలో అట్లాంటా జూకు పంపనున్నట్లు వెల్లడించారు.


చైనా-అమెరికా ప్రజల మధ్య స్నేహానికి పాండాలు ప్రతీకలుగా నిలిచాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, వచ్చే ఐదేళ్లలో ఒక లక్ష మంది అమెరికా విద్యార్థులు చైనాలో చదువుకునేలా కొత్త విద్యార్థి మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

హఫీజ్ సయీద్‌పై ప్రశ్నలు.. సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన షెహ్‌బాజ్ షరీఫ్

శ్వేత సౌధంలో మరో సంచలనం! జర్నలిస్టులను అడ్డుకోరాదని కోర్టు చెప్పినా..

Updated Date - Sep 25 , 2026 | 11:44 AM