Share News

హఫీజ్ సయీద్‌పై ప్రశ్నలు.. సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన షెహ్‌బాజ్ షరీఫ్

ABN , Publish Date - Sep 25 , 2026 | 08:14 AM

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్‌పై మాట్లాడేందుకు పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ నిరాకరించారు. 81వ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా హఫీజ్ గురించి జర్నలిస్టులు ప్రశ్నలు లేవనెత్తగా.. మాట్లాడకుండానే షెహ్‌బాజ్ షరీఫ్ వెళ్లిపోయారు.

హఫీజ్ సయీద్‌పై ప్రశ్నలు.. సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన షెహ్‌బాజ్ షరీఫ్

న్యూయార్క్: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్‌పై మాట్లాడేందుకు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ నిరాకరించారు. 81వ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA) సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి పాక్ ప్రధాని చేరుకున్నారు. యూఎన్‌ ప్రధాన కార్యాలయంలోకి ఆయన ప్రవేశిస్తుండగా.. ‘మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?’ అని జర్నలిస్టులు ప్రశ్నించారు. అయితే, షెహ్‌బాజ్ షరీఫ్ స్పందించకుండానే వెళ్లిపోయారు.


అనంతరం యూఎన్‌ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలోనూ హఫీజ్ గురించి జర్నలిస్టులు ప్రశ్నించారు. ‘లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్‌పై ఎప్పుడు విచారణ చేపడతారు?’ అని అడిగారు. అయితే, ఈసారీ పాక్ ప్రధాని ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. పైగా, జర్నలిస్టులను ఆపండి అన్న రీతిలో చేయి చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన హఫీజ్ మహమ్మద్ సయీద్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.


లష్కరే తోయిబా వ్యవస్థాపకుడిగా హఫీజ్‌ని భారత్ పేర్కొంది. 2008లో జరిగిన ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో అతడిపై ఆరోపణలు చేసింది. అలాగే, 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనతోనూ సంబంధం ఉందని తెలిపింది. ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లోనూ హఫీజ్ సయీద్‌ను A-8గా పేర్కొంది. దాడి వెనుక కుట్రలో అతని పాత్ర ఉందని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

శ్వేత సౌధంలో మరో సంచలనం! జర్నలిస్టులను అడ్డుకోరాదని కోర్టు చెప్పినా..

ఎయిర్‌పోర్టుకు వచ్చి జిన్‌పింగ్‌కు ట్రంప్‌ స్వాగతం

Updated Date - Sep 25 , 2026 | 08:21 AM