ఎయిర్‌పోర్టుకు వచ్చి జిన్‌పింగ్‌కు ట్రంప్ స్వాగతం
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:21 AM
అమెరికాలో అధికారిక పర్యటన కోసం గురువారం ఆ దేశంలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌కు ఘనస్వాగతం లభించింది.
వాషింగ్టన్, సెప్టెంబరు 24: అమెరికాలో అధికారిక పర్యటన కోసం గురువారం ఆ దేశంలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌కు ఘనస్వాగతం లభించింది. ఎప్పుడూ చైనాను విమర్శించే అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి జిన్‌పింగ్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో జిన్‌పింగ్‌కు రెడ్‌కార్పెట్ స్వాగతం పలికారు. ఆ తర్వాత వైట్‌హౌ్‌సలో జిన్‌పింగ్‌కు ట్రంప్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిన్‌పింగ్ మాట్లాడుతూ.. పరస్పరం ఘర్షణ పడితే ఇద్దరికీ నష్టమని.. కలిసి పనిచేస్తే ఇద్దరమూ లాభపడతామని అన్నారు. రెండు దేశాలు ‘థూసిడైడ్స్ ట్రాప్’ (అగ్రరాజ్యం తనకు పోటీగా ఎదుగుతున్న రాజ్యంతో యుద్ధానికి దిగటం)లో పడరాదని తెలిపారు. రెండుదేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించే పోటీ ఉండరాదని సూచించారు. ట్రంప్ మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రెండుదేశాల సైనికులు కలిసి పోరాడినట్లుగానే ఇప్పుడు జిన్‌పింగ్, తాను కలిసి పనిచేసి రెండుదేశాలకు ప్రయోజనం చేకూరుస్తామని ప్రకటించారు. కాగా, ట్రంప్‌తో వివాదం నేపథ్యంలో అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు జిన్‌పింగ్ పర్యటన కవరేజీకి దూరంగా ఉన్నాయి.
ఒత్తిడిలో ట్రంప్.. ఉత్సాహంగా జీ
జిన్‌పింగ్ పర్యటనపై ట్రంప్ గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అమెరికా రక్షణరంగ పరిశ్రమలకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్‌పై చైనా నియంత్రణ విఽధించటంతో ఈ పర్యటనలో ఎలాగైనా ఆ ఆంక్షలను ఎత్తివేయించాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. పనిలోపనిగా అమెరికా కంపెనీలకు చైనా కంపెనీలతో భారీ కాంట్రాక్టులు ఇప్పించాలని ప్రణాళికలు వేసుకున్నారు. తన ప్రణాళిక విజయవంతమైతే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మిడ్ ఎన్నికల్లో దానిని ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని వ్యూహం రచించారు. అయితే, జిన్‌పింగ్ ఈసారి తనవెంట పారిశ్రామికవేత్తలను తీసుకురాలేదు. దీంతో చైనా కంపెనీలతో ఒప్పందాలు కుదిరే అవకాశం తక్కువగా ఉంది. ఇక రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలోనూ జిన్‌పింగ్ వెనక్కు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు.. వైట్‌హౌస్ పత్రికా సమావేశాలకు హాజరు కాకుండా కొన్ని మీడియా సంస్థలపై నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలును ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అధ్యక్షుడు నిషేధించిన సీఎన్‌ఎన్, ఎమ్‌ఎస్ నౌ, పొలిటికో మీడియా సంస్థలకు అనుమతిని పునరుద్ధరించింది.