దేశ రాజధానిపై ప్రశాంత్ కిషోర్ కన్ను.. పార్టీ విస్తరణ దిశగా అడుగులు
ABN , Publish Date - Sep 26 , 2026 | 09:00 AM
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన జన్ సూరజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు తన పార్టీని విస్తరించే యోచనలో ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన జన్ సూరజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు తన పార్టీని విస్తరించే యోచనలో ఉన్నారు. దేశ రాజధానిలో జేఎస్పీ జెండా ఎగురవేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసమే ఈ ఆదివారం (సెప్టెంబరు 27) ఢిల్లీలో సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో దేశ రాజధానిలో ఆ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓ స్టీరింగ్ కమిటీని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.
అక్టోబర్ 2, 2024లో ప్రశాంత్ కిషోర్ జేఎస్పీని స్థాపించారు. 2025లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ సున్నా సీట్లు సాధించి, ఘోర పరాజయం పొందింది. అయితే ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన బంకిపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఆయన తన పార్టీని ఢిల్లీలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం
ఢిల్లీలోని పూర్వాంచలి జనాభాపై జేఏస్పీ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. బిహార్ మూలాలున్న చాలామంది పూర్వాంచలి ప్రజలు ఆదివారం నిర్వహించే సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకాబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ప్రజలు బీజేపీ, ఆప్‌లతో విసుగు చెందారని, అందుకే వారు జేఎస్పీని స్వాగతిస్తారని వివరించాయి.
ఇదే స్టీరింగ్ కమిటీ..
ఢిల్లీ రాజకీయాల కోసం జేఎస్పీ ఓ స్టీరింగ్ కమిటీని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఇందులో న్యాయవాది తథాగత్ హర్షవర్ధన్, దేశబంధు కళాశాల ప్రొఫెసర్ శంతను కుమార్, హిమాచల్ ప్రదేశ్ మాజీ ఏడీజీ పీ సింగ్ ఉండనున్నారు. అలాగే జేఎస్పీ నాయకులు కున్వార్ చంద్రేశ్, అబూ అద్నాన్ ఫరూఖీ, ప్రియాంక సింగ్ తదితరులు ఉంటారు.
ఇవీ చదవండి
యూపీఐపై ఎండీఆర్.. పన్ను కాదు.. సెస్ కాదు