Share News

జ్ఞానేశ్‌ వైదొలగాల్సిందే

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:47 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) అంశంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు దేశ వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేపట్టాయి

జ్ఞానేశ్‌ వైదొలగాల్సిందే
patna

  • dehradun.jpgదేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు.. పలుచోట్ల అరెస్టులు

  • ప్రజాగ్రహానికి భయపడుతున్న మోదీ, అమిత్‌ షా: జైరాం రమేశ్‌

  • జ్ఞానేశ్‌ అప్రూవర్‌గా మారాలి లేదా విచారణకు సిద్ధం కావాలి: పవన్‌ ఖేరా

ఓట్‌ చోరీ బాధ్యులను కఠినంగా శిక్షించాలి: కేసీ వేణుగోపాల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) అంశంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు దేశ వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేపట్టాయి. ఎన్నికల సంఘం కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు చేశాయి. ఢిల్లీ, బిహార్‌, అసోం, పంజాబ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు జరిగాయి. ఆందోళనల్లో భాగంగా కాంగ్రెస్‌ శ్రేణులు సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఈసీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికల సంఘం కార్యాలయాలకు ర్యాలీగా బయలుదేరాయి. ఈ ర్యాలీలను పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిహార్‌ రాజధాని పట్నాలో కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించగా.. జలఫిరంగులు, బారికేడ్లను ఉపయోగించి నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. చండీగఢ్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు యత్నించిన కాంగ్రెస్‌ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు.


లఖ్‌నవూలోని యూపీ శాసనసభకు భారీ వర్షంలో ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ సహా దాదాపు వంద మందిని పోలీసులు అరెస్టు చేశారు. అసోంలో కూడా కాంగ్రెస్‌ చేపట్టిన నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గౌరవ్‌ గగోయ్‌ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. సిమ్లాలోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్‌ శ్రేణులు.. ఈసీ కార్యాలయం బోర్డుపై నల్ల రంగు పూశాయి. భువనేశ్వర్‌లోని ఈసీ కార్యాలయానికి నిరసనగా బయలుదేరిన కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.. ఒడిసా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.


కాంగ్రెస్‌ నేతల ఫైర్‌

కాంగ్రెస్‌ శ్రేణులు చేపట్టిన ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ ముఖ్య నేతలు భగ్గుమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ప్రజాగ్రహాన్ని చూసి భయపడుతున్నారని కాంగ్రెస్‌ జనరల్‌ సేక్రటరీ జైరాం రమేశ్‌ అన్నారు. ఓటు హక్కును రక్షించుకోవడంతోపాటు ఎన్నికల సంఘంలో జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేస్తూ ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు రోడ్డెక్కారని జైరాం రమేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎన్నికల సంఘం, సీఈసీ వ్యవహారశైలిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ఈ నేపథ్యంలో మొదలైన నిరసనలను అణిచివేసేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పని చేస్తోందని పేర్కొన్నారు. ఇక, రాహుల్‌ గాంధీ సూచన మేరకు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ అప్రూవర్‌గా మారాలని లేనిపక్షంలో విచారణకు సిద్ధం కావాలని కాంగ్రెస్‌ పార్టీ మీడియా, ప్రచార విభాగం అధినేత పవన్‌ ఖేరా విలేకరులతో అన్నారు. సర్‌ సహా వివిధ అంశాల్లో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు. సీఈసీ అంశంలో సుప్రీం కోర్టు అన్నింటినీ గమనిస్తోందని, సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటుందని పవన్‌ ఖేరా ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పదవిని వీడడం తప్పదని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు ప్రారంభం మాత్రమేనని తెలిపారు. ఓట్‌ చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడిన వాళ్లని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

సీబీఎస్‌ఈ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కే భండారీ

సార్.. నోరు తెరవండి.. డీఎంకే అధినేత స్టాలిన్‌‌పై సీఎం విజయ్ ఫైర్

Updated Date - Sep 26 , 2026 | 05:50 AM