Share News

సార్.. నోరు తెరవండి.. డీఎంకే అధినేత స్టాలిన్‌‌పై సీఎం విజయ్ ఫైర్

ABN , Publish Date - Sep 25 , 2026 | 09:11 PM

మధురాంతకం ఉప ఎన్నిక నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్ డీఎంకే అధినేత స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు.

సార్.. నోరు తెరవండి.. డీఎంకే అధినేత స్టాలిన్‌‌పై సీఎం విజయ్ ఫైర్
CM Vijay

ఇంటర్నెట్ డెస్క్: మధురాంతకం ఉప ఎన్నిక నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్ డీఎంకే అధినేత స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. గ్రానైట్ వ్యాపారి ఆర్ వీరమణి లైంగిక వేధింపుల కేసు విషయంలో గత ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించలేదని ఆరోపించారు. మైనర్ల‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో చట్టం కింద వీరమణిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలోనే కేసు నమోదైందని సీఎం విజయ్ చెప్పారు. కేసు చరిత్ర మొత్తం అప్పట్లో భూస్థాపితమైందని అన్నారు. ఈ విషయంలో డీఎంకే ప్రభుత్వం అప్పట్లో గట్టి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఈ విషయంలో అవగాహన కుదిరిందా? అని ప్రశ్నించారు.


ఈ కేసుకు సంబంధించి తమపై వస్తున్న ఆరోపణలను డీఎంకే చీఫ్ స్టాలిన్ అంతకుముందే తోసిపుచ్చారు. తమ హయాంలో కేసును మూసేసే ప్రయత్నాలు జరగలేదని స్పష్టం చేశారు. అప్పట్లో తగిన ఆధారాల సేకరణ కుదరకపోవడంతో కేసు పెండింగ్‌లో పడిందని అన్నారు.

అన్నాడీఎంకే ఎమ్మెల్యే కుమరవేల్ రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో మధురాంతకంలో బైపోల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుంచి టీవీకే కుమరవేల్‌ను నామినేట్ చేసింది. అక్టోబర్ 6న ఎన్నిక జరగనుంది. ఈ పోటీ తమకు, డీఎంకేకు మధ్య మాత్రమేనని సీఎం విజయ్ చెప్పారు. ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీకి వ్యతిరేకంగా డీఎంకే, అన్నాడీఎంకేలు అవగాహనకు వచ్చాయని ఆరోపించారు. అన్నాడీఎంకే అధినేతలు ఎంజీఆర్, జయలలిత డీఎంకేను ఒక దుష్ట శక్తిగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి పార్టీతో జట్టు ఎలా కడతారని అన్నాడీఎంకేను ప్రశ్నించారు.

Updated Date - Sep 25 , 2026 | 09:58 PM