ఏపీని దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెడతాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 21 , 2026 | 03:40 PM
ఆర్థిక అసమానతలు తగ్గేలా పరిపాలన ఉండాలన్నదే కూటమి లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని.. మరో పదేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి నిలబెడుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం మీడియాతో మాట్లాడారు.
అమరావతి, నవంబర్ 21: ‘ఎన్నికలను సంస్కరించాలనే ఉద్దేశంతో మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా నిర్వహిస్తున్నాం. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు వద్దంటూ కొందరు ఓటర్లు బాలెట్ బాక్సుల్లో డబ్బులు వేయడం సంతోషాన్ని కలిగించింది. ఈ రీతిగానే ప్రజలు.. నేను చేసే పనులకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
నిబద్ధతతో పనిచేసి ప్రాణనష్టాన్ని తగ్గించాం: సీఎం
‘ఏపీకి కరువు, తుపాన్లు శాపంగా మారాయి. కరువు, తుపాన్ల వల్ల కలిగే నష్టాలను శాశ్వతంగా అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసం రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తున్నాం. మార్చి నాటికి పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. పంట నష్టంతో రైతులు కుదేలవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రెండు తుపాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నిబద్ధతతో పనిచేసి ప్రాణనష్టాన్ని తగ్గించాం. తుపాను బాధితులను, రైతులను ఆదుకుంటాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరుస్తున్నాం. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నాం. ఆర్థిక అసమానతలు తగ్గించాలన్నదే మా లక్ష్యం. రాజధాని అమరావతిని బెస్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు హద్దులు దాటొద్దు: సీఎం
‘వైసీపీ పాలనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే ఎన్నికలకు అడ్డుపడ్డారు. హింసతో ఎన్నికల్లో గెలవాలనుకున్నారు. కానీ.. ప్రజలు వైసీపీ కుట్రలను తిప్పికొట్టారు. ప్రజల విశ్వాసం లేకపోతే.. రాజకీయ పార్టీలకు మనుగడే ఉండదు. 2024 ఎన్నికల్లో ప్రజలకు మాకు శక్తిని ఇచ్చారు. నిన్నటి ఎన్నికల్లో తిరుగులేని నమ్మకం కల్పించారు. కొందరి ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు తిరస్కరించారు. ప్రజాభిప్రాయానికి కట్టుబడి ఉంటాం. కొన్ని చోట్ల వచ్చిన అననుకూల తీర్పుపై రివ్యూ చేస్తున్నాం. ఆయా ఎమ్మెల్యేలను కూడా పిలిచి మాట్లాడుతున్నాం. ఆ ఎమ్మెల్యేల తమ పనితీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా హద్దులు దాటొద్దు’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
నేనెప్పుడూ లైన్ దాటలేదు: సీఎం చంద్రబాబు
‘షర్మిల పెళ్లి కార్డు ఇస్తే.. సాక్షి పత్రికలో దారుణంగా రాశారు. షర్మిల వివాహానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను ఆహ్వానించారు. షర్మిల పెళ్లికి నేను కూడా వెళ్లాను. 1983 వరకు వైఎస్ నాకు బెస్ట్ ఫ్రెండ్. రాజకీయంగా విభేదించినా.. నేనెప్పుడూ లైన్ దాటలేదు. కానీ.. జగన్ సొంత చెల్లిపై కూడా దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. వైసీపీ చేసేది అరాచకం’ అని ముఖ్యమంత్రి జగన్‌ను దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి..
మత్స్యకారుల సంక్షేమం.. ఆక్వా రంగ అభివృద్ధే ఏపీ ప్రగతి: చంద్రబాబు
రాజకీయాల్లో వీడ్కోలు ఉండదు.. మాజీ కార్పొరేటర్లకూ సమాన గౌరవం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Read Latest AP News And Telugu News