ఏపీ లిక్కర్ స్కాం కేసు.. ప్రభుత్వ ఖజానాకి రూ.195 కోట్ల నష్టం
ABN , Publish Date - Jun 11 , 2026 | 09:28 PM
వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో భాగంగా హైదరాబాద్‌లో గురువారం పలుప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్, అమరావతి, జూన్11, (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసులో భాగంగా హైదరాబాద్‌లో ఈరోజు(గురువారం) పలుప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సోదాల అనంతరం ఈ కేసులో ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసు దేవారెడ్డి, రాజ్‌కసిరెడ్డిలని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇద్దరు నిందితులకు ఈనెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిని చంచల్‌గూడ జైలుకి ఈడీ అధికారులు తరలించారు.
అయితే, ఈకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు వివరించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, విజయ నర్సింహారెడ్డి, వల్లు సందీప్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కుమారుడికి చెందిన నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈడీ దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాల ప్రకారం, నిందితుల చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, వాసుదేవరెడ్డి తన అధికారిక హోదాను ఉపయోగించి అధిక ధరలకు ముందస్తుగా నిర్ణయించిన సంస్థలకు మద్యం రవాణా టెండర్లు కట్టబెట్టారని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ స్కాంలో రాజ్ కసిరెడ్డి, వాసుదేవారెడ్డి బంధువులకు చెందిన రూ.441.63 కోట్ల ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
అలాగే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించిన హైదరాబాద్ నివాసంలో సోదాలు జరిపిన అనంతరం ఈడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.195 కోట్ల మద్యం రవాణా కుంభకోణానికి పాల్పడి, మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం బేవరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖ రికార్టులను ఈడీ అధికారులు పరిశీలించారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు అధికారిగా ఉన్న వాసుదేవరెడ్డిని వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను ఏపీకి డిప్యుటేషన్‌పై ఉద్దేశ పూర్వకంగానే తీసుకువచినట్లు గుర్తించారు. ఆయా కంపెనీలకు ఆర్డర్ ఇవ్వాలంటే, ప్రతి కేసుకు రూ.200 నుంచి రూ.250లు కమీషన్ రూపంలో ఆయన తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News