పెరిగిన కూరగాయల ధరలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:54 PM
కూరగాయల ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది.
ఎండ తీవ్రతతో దెబ్బతిన్న పంటలు
కొత్తపంట వచ్చే వరకూ ఇదే పరిస్థితి
ధర్మవరం(అనంతపురం): కూరగాయల ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వేసవి ముందు వేసి కూరగాయల పంటలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా పండిన పంట సరిపోక ఇతర ప్రాంతాలు నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. కొత్తపంట మార్కెట్‌కు వచ్చే వరకూ ఇదేపరిస్థితి కొనసాగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో అన్ని రకాల నిత్యావసర సరుకులు, వంట నూనెల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా వేసవిలో ధరలు అధికంగా ఉండి వర్షాకాలం ప్రారంభ సమయానికి తగ్గడం ప్రారంభిస్తాయి. ఈసారి అందుకు భిన్నంగా రెండు వారాల వ్యవధిలో భారీగా పెరిగాయి. జిల్లాలో ధర్మవరం, బుక్కపట్నం, పుట్టపర్తి, ముదిగుబ్బ, బత్తలపల్లి, ఎన్‌పీకుంట, తలుపుల, తాడిమర్రి, ఓడీసీ, గోరంట్ల మండలాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరతో కొనుగోలు చేసి మార్కెట్‌లో రెట్టింపు చేసి విక్రయాలు చేస్తున్నారు.
రెండు వారాల్లోనే..
రెండు వారాల వ్యవధిలోనే కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. రెండు వారాల క్రితం వరకూ కిలో క్యారెట్ రూ.60 ఉండగా, ప్రస్తుత రూ.80కి పెరిగింది. వంకాయలు రూ.40నుంచి రూ.60కి, మునక్కాయలు రూ.60 నుంచి రూ.90, బీరకాయలు రూ.40 నుంచి రూ.50, పచ్చిమిరప రూ.40 నుంచి రూ.80, కాకర రూ.40 నుంచి రూ.60, బీరకాయలు రూ.60 నుంచి రూ.63, బీట్‌రూట్ రూ.40 నుంచి రూ.60కి పెరిగాయి. టమోట రూ.50 నుంచి రూ.40, బెండకాయలు రూ.50 నుంచి రూ.40కి స్వల్పంగా తగ్గాయి.
ధరల రెట్టింపుతో భారం
ఇటీవల కూరగాయల ధరలు గణనీయంగా పెరగడంతో తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నాం. అసలే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో సతమతమవుతున్నాం. దీనికితోడు కూరగాయల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. ఇలా అయితే నచ్చిన విధంగా వంటలు చేసుకోలేం. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ధరలను నియంత్రించాలి.
సరోజమ్మ, గృహిణి, ధర్మవరం
ఏమి కూరలు చేయాలో దిక్కుతోచట్లేదు
ప్రస్తుతం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో రూ.300 తీసుకుని మార్కెట్‌కు వెళ్లితే బ్యాగు నిండా కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం నాలుగైదురకాల కూరగాయలు కూడా రావడంలేదు. పైగా రూ.600 వరకు ఖర్చు అవుతోంది. దీంతో రోజు ఏమి కూరలు చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ధరలు తగ్గేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
గౌతమి, గృహిణి, ధర్మవరం
ఈ వార్తలు కూడా చదవండి:
రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News