వద్దు సర్.. తప్పు..!
ABN , Publish Date - Sep 13 , 2026 | 08:20 AM
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు పెడదారి పట్టడంతో మొత్తం విద్యావ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. సనాతన భారతీయ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు ఇచ్చారు.
విద్యార్థినులపై కొందరు టీచర్ల వక్రబుద్ధి
బెంబేలెత్తుతున్న పిల్లలు, తల్లిదండ్రులు
వరుస ఘటనలతో విద్యాశాఖలో కలవరం
పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి జడ్పీ ఉన్నతపాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఎవరూ లేని సమయంలో తన స్టూడెంట్ ఇంటికి వెళ్లాడు. ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో ఆమె తండ్రి ఇంటికి వచ్చాడు. అక్కడ జరుగుతున్న బాగోతాన్ని చూసి ఆగ్రహంతో ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశాడు. ఈ ఉదంతం బహిర్గతం కావడంతో విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులు ఆ టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
యల్లనూరు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఓ టీచర్ పాఠశాల విద్యార్థులు కొందరిని వేధిస్తున్నారని తల్లిదండ్రులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారించి ఆటీచర్‌ను ఇటీవల సస్పెండ్ చేశారు.
పామిడి మండలం అప్పాజీపేట ప్రాథమికపాఠశాలలో పనిచేస్తున్న ఓ ఎస్‌జీ టీచర్ తనపాఠశాలలో మధ్యాహ్నభోజనం వంటఏజెన్సీ మహిళతో అసభ్యంగా వ్యవహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యాశాఖాధికారులు ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు.
తాజాగా శుక్రవారం కళ్యాణదుర్గం నార్త్‌స్కూల్‌లో అమ్మాయి పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆటీచర్‌కు బడిత పూజ చేశారు. అనంతరం పోలీసులకు పట్టించారు. ఇవి జిల్లాలో ఇటీవల పాఠశాలల్లో వెలుగు చూసిన వరుస ఘటనలు.
గార్లదిన్నె ఏపీ మోడల్ స్కూల్‌లో ఓ టీచర్ ఇంటర్ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ అమ్మాయి భయపడి చదువు మానేసేందుకు సిద్ధమైంది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు.
అనంతపురం విద్య, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు పెడదారి పట్టడంతో మొత్తం విద్యావ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. సనాతన భారతీయ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు ఇచ్చారు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ సొంత బిడ్డల కంటే చిన్న వయసులో ఉండే పిల్లల పట్ల కొందరు ఉపాధ్యాయులు వక్రబుద్ధి చూపుతున్నారు. ఇలాంటి వరుస ఘటనలతో విద్యాశాఖలో కలవరం రేగుతోంది.
పర్యవేక్షణలేకనా.. భయంలేకనా ?
విద్యార్థుల పట్ల కొందరు ఉపాధ్యాయుల అకృత్యాలు పెరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నెలతిరిగేసరికే లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ వృత్తి ధర్మం మరచి పాడుపనులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బడిలో దారుణాలు జరగడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటమా లేక తప్పు చేస్తే తాటతీస్తారన్న భయం లేకపోవడమా అన్నవి అంతు చిక్కని ప్రశ్నలుగా మిగిలాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ సమయం వరకు ఏమి జరగకుండా ఉంటే చాలనే ఆలోచన చేస్తున్నారు. బడిలో ఏ టీచర్ ఏమి చేస్తున్నారో చూడటంలేదు, తెలుసుకోవడంలేదు. అలాగే డిప్యూటీ డీఈవోలు పాఠశాలల పర్యవేక్షణకే వెళ్లడంలేదు. ఎంఈవోలనే డిప్యూటీ డీఈవోలుగా ఉంచడంతో వారు ధైర్యంగా పాఠశాలల పర్యవేక్షణ చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇకమండలాలలో ఉన్న ఎంఈవోలు సైతం పర్యవేక్షణ చేయడంలేదు. ఎంఈవో-1, ఎంఈవో-2ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుండటంతో ఎవరికివారుగా ఉండిపోతున్నారు. దీంతో ఉపాధ్యాయులు ఏమాత్రం భయం లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహారాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తప్పుడు పనులు చేసినప్పుడు సీరియస్ యాక్షన్ లేకపోవడం కూడా మరొకరు తప్పు చేయడానికి కారణమవుతోందనే విమర్శలు ఉన్నాయి.
ఒకరిద్దరి వల్ల వ్యవస్థకే చెడ్డపేరు
సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక గౌరవం ఉంది. ఒకరిద్దరి వల్ల మొత్తం టీచర్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. ఘటనలు జరిగిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి. రాష్ట్రశాఖ అధికారులు కూడా ఇదే విషయమై వివరణ కోరారు. అందుకే టీచర్లకు కాంప్లెక్స్ మీటింగ్‌లలో ఈ వేధింపుల గురించి ప్రత్యేకంగా అవగాహన పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
- అయూబ్ హుస్సేన్, డీఈవో
సీరియస్‌గా చర్యలు లేవు..
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలపై సీరియస్ చర్యలు లేవు. ఘటన జరిగినపుడు విచారణకు కమిటీలంటారు. ఆతర్వాత తూతూమంత్రంగా విచారణ చేస్తున్నారు. కొందరికి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారు. మరికొందరిని సస్పెండ్ చేస్తున్నారు. మరికొద్దిరోజులకే పోస్టింగ్ ఇస్తున్నారు. దీంతో తప్పుడు పనులు చేసే ఉపాధ్యాయులకు భయం లేకుండా పోయింది. అందుకే ఇలాంటి ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. విద్యార్థులతో తప్పుగా ప్రవర్తించిన ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగించాలి.
- మంజునాథ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు
క్వాంటం బయో వ్యాలీపై సీఎం చంద్రబాబు ఆలోచన బాగుంది: జేపీ నడ్డా
ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను అప్రమత్తం చేయండి..అధికారులకు పవన్ దిశానిర్దేశం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News