ఏడాదిలో మార్పు రాకుంటే రాజీనామా
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:40 PM
రాజకీయాల్లో మార్పుకోసం తాడిపత్రితోపాటు యల్లనూరు మండలంలో చదువుకున్నవారికి ఎన్నికల్లో అవకాశం ఇచ్చామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
మార్పు కోసమే విద్యావంతులను తెచ్చాం
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి(అనంతపురం): రాజకీయాల్లో మార్పుకోసం తాడిపత్రితోపాటు యల్లనూరు మండలంలో చదువుకున్నవారికి ఎన్నికల్లో అవకాశం ఇచ్చామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తన పిలుపుతో 50 శాతం మంది విద్యావంతులు ఎన్నికల్లో నిలబడ్డారని అన్నారు. ఫ్యాక్షన్ సంస్కృతిని విడనాడి, ప్రశాంతంగా జీవించాలని, దీనివల్ల గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఏడాదిలోగా తాను ఆశించిన మార్పు రాకపోతే అందరిచేత రాజీనామాలు చేయిస్తానని అన్నారు. తాడిపత్రిలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యావంతులైన యువకులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా రాజకీయ ఫ్యాక్షన్ కొనసాగుతోందని, అందుకే గ్రామాలు అభివృద్ధి చెందడంలేదని అన్నారు. గ్రామాల్లో ఫ్యాక్షన్ గుంపులుగా ఏర్పడి, రిగ్గింగులు చేసేవారని, ఇళ్లపై దాడులు చేసి బాంబులు వేసేవారని అన్నారు. ఆ కాలం పోయిందని, ఇప్పుడు వాహనాలను దహనం చేయడం పరిపాటిగా మారిందని అన్నారు. అప్పట్లో రాయలసీమ ఫ్యాక్షన్ కర్నూలు, పులివెందుల నుంచి ప్రారంభమయ్యాయని అన్నారు. రాయలసీమవాసులు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి కడప జిల్లాకు భారీగా చేశారని, పులివెందులను ఎవరు చేయని విధంగా అభివృద్ధి చేశారని అన్నారు.
అభివృద్ధి విషయంలో రాజకీయాలను పక్కనపెడతామని, అవసరమైతే వైసీపీ నాయకుల ఇళ్లవద్దకు కూడా వెళ్లి కలుస్తానని అన్నారు. యాడికి మండలంలో ఎర్రబాబు, బొంబాయి రమేష్ వంటి నాయకులు సహకరించారని అన్నారు. పెద్దవడుగూరు, పెద్దపప్పూరు మండలాల్లో నాయకులు అందరూ సహకరించారని అన్నారు. ప్రతి చిన్న పనికి ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని, వనరులు సృష్టించుకుని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. యాడికి ఆలయానికి 1100 ఎకరాల భూమి ఉందని అన్నారు. కిష్టిపాడు వద్ద గనులు, పెద్దవడుగూరులో వనరులు ఉన్నాయని, పెద్దపప్పూరు మాత్రమే కొంత ఇబ్బందిగా ఉందని అన్నారు.
వాటిని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. యాడికి పంచాయతీలో 36 మంది కార్మికులు ఉన్నా, అక్కడ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఒక్కొక్కరికి రూ.6వేలు జీతం చెల్లిస్తున్నారని, నెలకు రెండు లక్షలు పైబడి జీతాలు పోతున్నా అభివృద్ధి జరగడం లేదని అన్నారు. యల్లనూరు మండలంలో దాదాపు 940ఎకరాలు స్వామికి భూమి ఉందని, అయినా అభివృద్ధి చేయలేదని అన్నారు. ‘మా అపోజిషన్ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి నీవు మొగోనివా? ఒకసారి టచ్‌చేసి చూడు అని అంటున్నారు. నేను మొగోన్ని కాదు. టచ్ చేయలేను. నువ్వే టచ్ చెయ్’ అని సవాలు విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు క్షేమం
Read Latest AP News And Telangana News And International News And Telugu News