Share News

సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు క్షేమం: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:46 PM

కాకినాడ జిల్లా ఏటిమొగ నుంచి చేపల వేటకు వెళ్లి ఇంజిన్ వైఫల్యంతో నిలిచిపోయిన బోటులో ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు క్షేమం: మంత్రి అచ్చెన్నాయుడు
Minister Atchannaidu

అమరావతి, నవంబర్ 25: కాకినాడ జిల్లా ఏటిమొగ నుంచి చేపల వేటకు వెళ్లి ఇంజిన్ వైఫల్యంతో నిలిచిపోయిన బోటులో ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉప్పాడ-తుని తీరంలోని కృష్ణాపురం సమీపంలో తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో బోటు నిలిచిపోయిందన్నారు. ఫోన్‌కాల్ అందిన వెంటనే కోస్ట్‌గార్డ్, నౌకాదళాన్ని అప్రమత్తం చేసిన అధికారుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. సముద్రంలో నీటి లోతు తక్కువగా ఉండటంతో మరో బోటు సహాయంతో మత్స్యకారులను తీరానికి చేర్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన చెందవద్దని.. ఏడుగురినీ సురక్షితంగా తీరానికి చేర్చేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.


ఇక కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారుల గల్లంతయ్యారని.. వారి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయడు అన్నారు. గల్లంతైన మత్స్యకారుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేంగా లేఖ రాశామని.. కేంద్ర సహకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ సముద్ర జలాల్లోనూ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని.. ఆయా దేశాల ప్రతినిధులతో సంప్రదింపులకు చర్యలు చేపట్టామని తెలిపారు. కోస్ట్‌గార్డ్, నౌకాదళం, ఒడిశా అధికారుల సమన్వయంతో యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేస్తున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల ప్రాణరక్షణే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. గల్లంతైన ఏడుగురినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తి

ఉప్పాడ మత్స్యకారుల కోసం పారాదీప్ సముద్ర జలాల్లో గాలింపు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 12:50 PM