Share News

హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:25 PM

హనుమకొండలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించారు.

హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు
Hanumakonda Clash

హనుమకొండ, నవంబర్ 25: హనుమకొండలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించారు. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో పోలీసుల భద్రత కొనసాగుతోంది. నిన్నటి ఘటనలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి తమ కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్న బీఆర్ఎస్ జననచైతన్య సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తట్టుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు.


హనుమకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియంతృత్వం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. కచ్చితంగా ఎమ్మెల్యేకు, ఆయనకు సహకరించే పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. రాయలసీమ సంస్కృతిని ఇక్కడికి తీసుకురావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ అలాంటి సంస్కృతికి తావులేదన్నారు. కాంగ్రెస్ దాడులను తిప్పికొడతామని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.


క్యాంప్‌ ఆఫీస్‌పై దాడి ఎంతవరకు సమంజసం: నాయిని

తన క్యాంప్ ఆఫీస్‌పై దాడికి యత్నించడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే, చర్చకు రాకుండా క్యాంప్ ఆఫీస్‌పై ధర్నా పేరుతో దాడికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాను క్యాంప్ ఆఫీస్‌లో లేని సమయంలో, తన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారని తెలిసి క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి ధర్నా పేరుతో దాడికి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య అంటూ నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


నిన్న ఏం జరిగిందంటే..

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ శ్రేణుల పరస్పర దాడులతో నిన్న హనుమకొండ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. అభివృద్ధిపై చర్చకు సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. బీఆర్‌ఎస్ నేత వినయ్ భాస్కర్ విసిరిన సవాల్‌కు ప్రతిస్పందనగా కాంగ్రెస్ నేతలు హనుమకొండ చౌరస్తాకు చేరుకోగా.. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు సమీపంలోనే ఉండటంతో ఇరుపార్టీల కార్యకర్తలు అక్కడకు చేరుకుని రాళ్లు, కోడిగుడ్లతో దాడులకు దిగారు. ఫ్లెక్సీల చించివేతతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టి లాఠీఛార్జ్ చేశారు. నిన్నటి ఘటనల నేపథ్యంలో ఈరోజు కూడా పోలీసులు అప్రమత్తమై.. హనుమకొండలో భద్రతను కట్టుదిట్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

బాసరలో అగ్నిప్రమాదం.. పెళ్లి సామాగ్రి సహా నగదు, బంగారం దగ్ధం

కంఠేశ్వర ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 12:34 PM