ఎన్నికలకు కట్టుదిట్టమై భద్రతా చర్యలు చేపట్టాం: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:25 PM
ఏపీలో రేపు (గురువారం) తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పరిశీలించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా.. భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా, నవంబరు 25: ఏపీలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా.. భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని.. తొలి విడతలో భాగంగా విజయవాడ రూరల్, గన్నవరం, మైలవరం నియోజకవర్గాల్లోని 73 పంచాయతీలు, 893 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 288 గ్రామ పంచాయతీలు, 3,088 వార్డులు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో దాదాపు 9 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కొన్ని పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు.
జిల్లాలోని 2,100 సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని.. జిల్లా-కమిషన్ స్థాయిలో పర్యవేక్షణ చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల కోసం సుమారు 600 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. సాధారణ కేంద్రాల్లోనూ వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాగా.. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తామని.. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద లైటింగ్, పవర్ బ్యాకప్ వంటి అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉన్నా.. లేదా ఏమైనా సమస్యలున్నా.. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు ఆర్వో, ఎంపీడీవోలను సంప్రదించాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి