Share News

తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి.. రెండు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహం

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:12 PM

అస్సాంలో విధులు నిర్వహిస్తూ కుషియారా నదిలో గల్లంతైన తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కె. వేణు మృతదేహం రెండు రోజుల తర్వాత లభ్యమైంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి.. రెండు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహం
Constable Venu

ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలో విధులు నిర్వహిస్తూ కుషియారా నదిలో గల్లంతైన తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కె. వేణు మృతదేహం రెండు రోజుల తర్వాత లభ్యమైంది. భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో పశువుల స్మగ్లర్లుగా అనుమానిస్తున్న వ్యక్తులను వెంబడించే క్రమంలో సోమవారం ఆయన అదృశ్యమయ్యారు. 32 ఏళ్ల వేణు అస్సాంలోని హరినగర్ బోర్డర్ అవుట్‌పోస్ట్‌లో కానిస్టేబుల్ (జీడీ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, నదీ పోలీసులు, బీఎస్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8.20 గంటల ప్రాంతంలో శ్రీభూమి జిల్లాలోని స్టీమర్‌ఘాట్ సమీపంలో కుషియారా నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ మిజోరం, కచార్ ఫ్రాంటియర్ డీఐజీ అహ్సన్ షహేది ధ్రువీకరించారు.


ప్రాథమిక విచారణలో జవాన్ మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. బీఎస్ఎఫ్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక విమానంలో స్వరాష్ట్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. వేణు అదృశ్యమైన సమయంలో ఆయనను బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) నుంచి అలాంటి సమాచారం ఏదీ అందలేదని బీఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. పశువుల అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్న నలుగురైదుగురు అనుమానితుల కదలికలపై నిఘా సమాచారం అందడంతో సోమవారం తెల్లవారుజామున హరినగర్ బీఓపీ సమీపంలో గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల పాటు కొనసాగిన గాలింపు చర్యలు చివరకు విషాదాంతమయ్యాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 12:16 PM