‘గుడ్డు’పుఠాణి.. ఐసీడీఎస్‌లో అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:38 PM
అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్లు మరీ చిన్నబోయాయి. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం వాటిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరాలో అక్రమాలు
మరీ చిన్నవి ఇస్తున్న వైనం
కనిపించని రంగులు
పుట్టపర్తి(సత్యసాయి): అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్లు మరీ చిన్నబోయాయి. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం వాటిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బరువు తక్కువ, పరిణామం చిన్నగా వాటిని సరఫరా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. రంగు ముద్రలతో కూడిన గుడ్లను సరఫరా చేయాల్సి ఉంది. గుడ్లపై అవి కనించడమే లేదు. వెరసి గుడ్ల సరఫరా ఇష్టారాజ్యంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రోజూ లక్షల్లో బిల్లులు
పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వాలు కోడిగుడ్లు సరఫరా చేస్తున్నాయి. వాటిని ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని అంగన్‌వాడీల ద్వారా ఆరేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నారు. జిల్లాలో 2,824 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో గర్భిణులు, బాలింతలు 17,350 మంది, చిన్నారులు 76,464 మంది ఉన్నారు. వారందరికీ ప్రతినెలా 21.50 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నారు. రోజుకు 86,000 గుడ్లు పంపిణీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్డు బరువు 60 గ్రాములు, క్రేట్ బరువు 1.5 కిలోలు ఉండాలి.
అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్న గుడ్ల బరువు 35 నుంచి 40 గ్రామలు మధ్యే ఉంటున్నట్లు తెలుస్తోంది. అధికారులతో కుమ్మక్కైన కాంట్రాక్టర్లు మరీ చిన్న వాటిని సరఫరా చేస్తున్నారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఒక్కొక్కరికి నెలకు 25 గుడ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. బాలింతలు, గర్భిణులకు ఇంటికే సరుకులు, 25 గుడ్లను అందజేస్తారు. మూడేళ్లలోపు చిన్నారులకు కూడా పాలతోపాటు గుడ్లను ఇంటికే అందించాల్సి ఉంది. జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (నెక్) నిర్ధారించిన ధర ప్రకారం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. రవాణా చార్జీ కింద గుడ్డుకు రూ.1.10 ఇస్తారు. నెక్ ప్రకారం ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పౌలీ్ట్ర మార్కెట్ ధరను (రూ.6.00) అనుసరించి రవాణా చార్జీలను కలుపుకుని కాంట్రాక్టర్లు.. అంగన్వాడీ కేంద్రాలకు రూ.7.10 చొప్పున గుడ్లను చేరుస్తుంటారు. ఈలెక్కన కాంట్రాక్టర్లకు రోజుకు రూ.6.10 లక్షలు బిల్లులు చెల్లిస్తారు.
నాణ్యత, పరిమాణం తక్కువగా ఉంటే వాపసు చేయమన్నాం
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వాపసు చేయాలని సీడీపీవోలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సూచించాం. నిబంధనలకు అనుగుణంగా కోడిగుడ్లను సరఫరా చేయాలి. నాణ్యత, పరిమాణం లేని గుడ్లను తిరిగి పంపుతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేస్తాం.
ప్రమీల, ఐసీడీఎస్ పీడీ
రంగులు మాయం
కోళ్ల ఫారాల వద్ద గుడ్లను పరిమాణం బట్టి వేరుచేస్తారు. సైజును బట్టి ధర ఉంటుంది. మార్కెట్లో వ్యాపారులు బరువు, పరిమాణం తక్కువగా ఉన్న వాటిని తీసుకోరు. వాటిని అంగన్‌వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్లు అంటగడుతున్నారు. నిబంధనల మేరకు కాంట్రాక్టర్లు నెలలో నాలుగుసార్లు గుడ్లను సరఫరా చేయాలి. మొత్తం గుడ్లను రెండు దఫాలుగా సరఫరా చేసి, రవాణా చార్జీలను నొక్కేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ తతంగం ఎక్కువగా సాగింది. దీంతో కూటమి ప్రభుత్వం పారదర్శకత కోసం గుడ్లపై రంగులు వేయాలని సూచించింది. గుడ్లను రంగులు వేయకుండానే అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్ వేధింపులు..
రాజకీయాల కోసం మత్స్యకారులను రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు:
Read Latest AP News And Telangana News And International News And Telugu News