Share News

ఖరీఫ్‌ సాగు ఖతం..!

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:54 PM

ఎల్‌నినో .. ఈసారి ఖరీఫ్‌ రైతులకు తీవ్ర నిరాశ మిగిలించింది. వర్షాలు కురవకపోవడంతో వేరుశనగ సాగుచేయలేకపోయారు.

ఖరీఫ్‌ సాగు ఖతం..!
El Nino impact on agriculture

  • నిరాశ నింపిన ఎల్‌నినో

  • 4వేల హెక్టార్లలో 800లో మాత్రమే సాగు

  • ప్రత్యామ్నాయమే దిక్కా?

నల్లమాడ(అనంతపురం): ఎల్‌నినో .. ఈసారి ఖరీఫ్‌ రైతులకు తీవ్ర నిరాశ మిగిలించింది. వర్షాలు కురవకపోవడంతో వేరుశనగ సాగుచేయలేకపోయారు. మండలంలోని నాలుగు వేల హెక్టార్లల్లో వేరుశనగ పంట సాగుచేయాల్సి ఉండగా.. ఈసారి బోరుబావుల కింద కేవలం 800 హెక్టార్లల్లో మాత్రమే సాగుచేశారు. మిగిలిన 3,200 హెక్టార్లు బీళ్లుగా వదిలేశా రు. ఈసారి సాగుచేయకపోవడంతో కూలీలకు కూడా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు.


zzzz.jpg

  • ప్రత్యామ్నాయ విత్తనాలు అందేనా..?

ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. తక్కువ సమయంలోనే చేతికొచ్చే పంటలు సాగుచేస్తే సులువుగా ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో.. తక్కువ కాలంలో చేతికి వచ్చే ఉలవ, అలసంద, పెసర, జొన్న తదితర పంటలను సాగుచేయాలని సూచిస్తున్నారు. మండలానికి ఉలవలు 730 క్వింటాళ్లు, అలసందలు 25 క్వింటాళ్లు, మినుములు 8 క్వింటాళ్లు, పెసర 8 క్వింటాళ్లు, జొన్నలు 15 క్వింటాళ్లు అవసరమని ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఇప్పటికే దాదాపు రెండువందల హెక్టార్లలో విత్తన గుళికలు పద్ధతిలో సాగు చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామాలవారీగా రైతు సమావేశాలు నిర్వహిస్తూ, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన సాగు విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.


  • జాడ లేని వర్షం

ఇప్పుడైనా వర్షాలు వస్తే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయడానికి కొందరు రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వం సబ్సిడీతో అందించే ప్రత్నామ్యాయ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వర్షం జాడే లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ సాగుపై కూడా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో రైతులు ధైర్యం చేయలేకపోతున్నారు.


zzz.jpgవర్షం కోసం ఎదురుచూపు

నాకు ఐదెకరాల పొలముంది. రెండు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. మూడు ఎకరాలను బీడుగా వదిలేశా. ప్రభుత్వం అలసందలు, జొన్న, ఉలవలు తదితర ప్రత్యామ్నాయ విత్తనాలను సబ్బిడీతో అందిస్తే.. ఆ మూడు ఎకరాల్లో సాగుచేస్తా. ఇప్పటికైనా వర్షాలు వస్తే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయడానికి చాలా మంది రైతులు సిద్ధంగా ఉన్నారు.

  • వేణుగోపాల్‌, చౌటుకుంటపల్లి, నల్లమాడ


ప్రతిపాదనలు పంపాం

మండలానికి ప్రత్యామ్నాయ విత్తనాలైన ఉలవ, అలసంద, పెసర, జొన్న 800 క్వింటాళ్లు అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. ఆ విత్తనాలు మండలానికి చేరిన వెంటనే రైతులకు పంపిణీ చేస్తాం.

  • అబ్దుల్‌హక్‌, ఏవో


ఈ వార్తలు కూడా చదవండి:

అమరావతిలో ఏపీ భవిష్యత్తు, ఆత్మగౌరం కనిపిస్తోంది
ఆదోనిలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 12:54 PM