యథేచ్ఛగా రీ ఫిల్లింగ్ దందా
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:08 AM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో సబ్సిడీ గ్యాస్ రీ ఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. జనావాసాల మధ్య అక్రమ దందా నడుస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
జగిత్యాల, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో సబ్సిడీ గ్యాస్ రీ ఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. జనావాసాల మధ్య అక్రమ దందా నడుస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన జగిత్యాలతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి పట్టణాల్లో, పలు మండల కేంద్రాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. పలు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, గ్యాస్ డెలివరీ బాయ్స్ అక్రమార్జనకు తెరలేపి సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫకమర్షియల్, మినీ సిలిండర్లలోకి ఫిల్లింగ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తుండడంతో రీ ఫిల్లింగ్ దందా ఉధృతంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్యాస్‌ను తక్కువగా వినియోగించుకునే వారిని గ్యాస్ డెలివరీ బాయ్స్, ఏజెన్సీ నిర్వాహకులు గుర్తించి వారిచే గ్యాస్ బుక్ చేయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీని మీరే తీసుకోండి అని వినియోగదారులకు ఆఫర్ ఇచ్చి గాలం వేస్తున్నారు. దీంతో వినియోగదారులు వారి వైపు మొగ్గు చూపి గ్యాస్ బుక్ చేస్తున్నారు. ఇలా వచ్చిన గ్యాస్ సిలిండర్‌ను రీ ఫిల్లింగ్, వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే వారికి డిమాండ్‌ను బట్టి రూ.1,500 వరకు విక్రయిస్తున్నారు. వీరి అక్రమాలపై నిఘా పెట్టి నియంత్రించాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫఅక్రమ సంపాదనకు ఆశపడి..
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కార్మికులు, బ్యాచిలర్లు, స్థానికేతరులు, పేదలు అధికంగా ఉంటున్నారు. వీరిలో చాలా మందికి స్థానికంగా గ్యాస్ కనెక్షన్లు లేకపోవడంతో మార్కెట్‌లో సులభంగా దొరికే చిన్న సిలిండర్లను వినియోగిస్తున్నారు. చిన్న సిలిండర్ల అమ్మకందారులు సబ్సిడీ గ్యాస్‌ను తమ అక్రమ వ్యాపారానికి వాడుతున్నారు. ప్రభుత్వం అందించే గ్యాస్ బండలో సుమారు 14.5 కిలోల వరకు గ్యాస్ ఉంటుంది. వీటి నుంచి చిన్న సిలిండర్‌లోకి రెండు, రెండున్నర కిలోల గ్యాస్ నింపి రూ.125 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. అదనంగా డబ్బులు గడించడానికి పలువురు వ్యాపారులు అక్రమ దందా చేస్తున్నారు.
ఫప్రమాదమని తెలిసినా...
జిల్లా వ్యాప్తంగా సుమారు వంద వరకు అక్రమ సిలిండర్ రీ ఫిల్లింగ్ కేంద్రాలున్నట్లు అనధికార అంచనా ఉంది. ఇక్కడ చాలా వరకు వ్యాపార కేంద్రాల్లో అన్ని వస్తువుల మాదిరిగానే చిన్న సిలిండర్ల అమ్మకాలు సాగిస్తున్నారు. సబ్సిడీ సిలిండర్ నుంచి చిన్న సిలిండర్‌లోకి గ్యాస్‌ను రీ ఫిల్లింగ్ చేయడం ప్రమాదకరమైనప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో గతంలో పలు ప్రమాదాలు జరిగినా అక్రమార్కులు సులభంగా వచ్చే ఆదాయం కోసం ఈ దందాను నడుపుతున్నారు. రీఫిల్లింగ్ కేంద్రాలు జనావాసాల మధ్య సాగుతుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.
ఫఅంతా బహిరంగమే...
పట్టణ, మండల కేంద్రాల్లోని పలు దుకాణాల్లో, వాహనాల్లో గ్యాస్ రీ ఫిల్లింగ్ చేసే వారు అంతా బహిరంగంగానే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి చిన్న సిలిండర్లను కొనుగోలు చేసి జిల్లాకు తరలించి వ్యాపారం చేస్తున్నారు. గ్యాస్ రీ ఫిల్లింగ్ చేసే వారు ముందుగా గ్యాస్ డెలివరీ వ్యక్తులకు అడ్రస్ చెప్పి వారి వద్ద గ్యాస్‌ను డెలివరీ చేయించి ఆ తదుపరి అక్రమ దందాకు పాల్పడుతున్నారు. మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, ఉన్నత చదువుల కోసం వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి, పట్టణ ప్రాంతాలకు వస్తున్న యువకులు, విద్యార్థులు, ఒంటరి మహిళలు, వృద్ధులు మినీ సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీరి అవసరాలను ఆసరా చేసుకొని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబందిత శాఖ అధికారులు దృష్టి సారించి అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన అవసరముంది.
మా దృష్టికి తీసుకవస్తే చర్యలు తీసుకుంటాం
- జితేందర్‌రెడ్డి, జిల్లా సివిల్ సప్లయిస్ శాఖ అధికారి
జిల్లాలో సబ్సిడీ గ్యాస్ రీ ఫిల్లింగ్‌పై ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదు. అక్రమ దందా గురించి ఎవరైనా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాము. సబ్సిడీ గ్యాస్‌ను రీ ఫిల్లింగ్ చేయడం ప్రమాదకరం. అక్రమాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నాము.