Share News

విద్యార్థి కిట్లు 99.75 శాతం పంపిణీ

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:18 AM

రాష్ట్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ దాదాపుగా పూర్తయ్యింది. మొత్తంగా దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు 99.75 శాతం వరకు కిట్లను అందజేశారు.

విద్యార్థి కిట్లు 99.75 శాతం పంపిణీ

  • దాదాపు 33 లక్షల మందికి అందజేత

  • యూనిఫాం, షూ, బ్యాగ్‌లు కొంత పెండింగ్‌

  • బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపులు

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ దాదాపుగా పూర్తయ్యింది. మొత్తంగా దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు 99.75 శాతం వరకు కిట్లను అందజేశారు. నోట్‌ పుస్తకాలు, బెల్టులు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌ పుస్తకాలు, పిక్టోరియల్‌ డిక్షనరీల పంపిణీ వంద శాతం పూర్తి కాగా, యూనిఫాం క్లాత్‌ పంపిణీ 99.86 శాతం, బూట్లు 98.46 శాతం, బ్యాగులు 99.68 శాతం పంపిణీ జరిగింది. మిగతా పంపిణీ కూడా త్వరలోనే పూర్తి అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. బడులు తెరిచిన జూన్‌ 12 నుంచి విద్యార్థి కిట్ల పంపిణీ ప్రారంభించారు. ఈ ఏడాది యుద్ధం కారణంగా కిట్‌ వస్తువుల తయారీలో జాప్యం ఏర్పడింది. ముడిసరుకు రవాణాలో అంతరాయం ఏర్పడటంతో ఈ సమస్య తలెత్తింది.


పేరుకుపోతున్న బకాయిలు

ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు కిట్లు అందజేస్తున్నా వాటిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం కొండలా పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకూ రూ.1395 కోట్ల మేర బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2026-27 విద్యాసంవత్సరం బిల్లులు రూ.838 కోట్లు, 2025-26 బిల్లులు రూ.408 కోట్లు, 2024-25 బిల్లులు రూ.147 కోట్ల మేర ఉన్నాయి. ఇందులో పాఠ్యపుస్తకాలు, వాటికి పేపరు సరఫరా చేసిన వారికీ బిల్లులు చెల్లించాలి. అయితే ఇన్నేళ్లు బిల్లుల కోసం వేచిచూస్తే తీవ్ర నష్టం వస్తోందని, దీంతో ఇకపై కిట్ల కాంట్రాక్టుకు ముందుకురాలేని పరిస్థితి ఏర్పడుతోందని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రెండేళ్ల నుంచి తాము కిట్లు సరఫరా చేయలేమని చివర్లో చేతులెత్తేస్తున్నారు. అయితే అధికారుల ఒత్తిడితో కిట్లు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైనా తమ బిల్లులు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 04:20 AM