గోదావరి తీరాన పురాతన అవశేషాలు
ABN , Publish Date - Aug 05 , 2026 | 10:37 AM
కోట్ల ఏళ్లనాటి భూగోళ చరిత్రకు ములుగు జిల్లా సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. గోదావరి తీర ప్రాంతంలో ప్రాచీన జీవ జాలం, మహా వృక్షాలు రాయిగా మారిన అరుదైన శిలాజ ప్రపంచం తాజాగా వెలుగు చూసింది.
ములుగు జిల్లాలో అరుదైన శిలాజాలు
గిరిజన ప్రాంతాల్లో ఏళ్లనాటి సజీవ సాక్ష్యాలు
రాయిగా మారిన మహా వృక్షాలు
ప్రకృతి మలిచిన అరుదైన గోళాకార శిలలు
ములుగు: కోట్ల ఏళ్లనాటి భూగోళ చరిత్రకు ములుగు జిల్లా సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. గోదావరి తీర ప్రాంతంలో ప్రాచీన జీవ జాలం, మహా వృక్షాలు రాయిగా మారిన అరుదైన శిలాజ ప్రపంచం తాజాగా వెలుగు చూసింది. గిరిజన సీమలో భూగర్భ జలాల అన్వేషణ, సర్వేల సందర్భంగా సంబంధిత శాఖ అధికారులకు ఇటీవల కొన్ని అరుదైన శిలాజాలు లభించగా, వాటిని తమ కార్యాలయంలో భద్రపరిచారు.
మనం నడుస్తున్న నేల కింద ఎన్నో కోట్ల ఏళ్లనాటి నిశ్శబ్ద చరిత్ర నిద్రపోతోంది. అసలు మనుషులే లేని ఆ కాలంలో ప్రకృతి స్వయంగా రాసిన విచిత్ర చరిత్ర ఇప్పుడు ములుగు జిల్లాలో కళ్లముందు దర్శనమిస్తోంది. కోట్ల ఏళ్ల క్రితం ప్రాణం పోసుకొని, కాలక్రమంలో భూమి పొరల్లో పూడుకుపోయి రాళ్లుగా మారిన చెట్లు, ప్రాచీన నదుల ప్రవాహ తీరును తెలిపే రకరకాల రాతి రూపాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తు న్నాయి. జిల్లా భూగర్భ జలశాఖ కార్యాలయంలో భద్రపరిచిన ఈ అరుదైన శిలాజాలు, ప్రత్యేక రాళ్లు భూగోళ పరిణామ క్రమానికి, తెలంగాణ భౌగోళిక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
వృక్ష శిలాజాలు మంగపేటలో లభ్యం
ప్రస్తుతం భూగర్భ జలశాఖ కార్యాలయంలో ఉన్న ఈ అరుదైన వృక్ష శిలాజాలు జిల్లాలోని మంగపేట మండల పరిధిలో ఇటీవల లభించాయని అధికారు లు వెల్లడించారు. అలాగే 2020-21లో కన్నాయిగూ డెం మండల పరిధిలో ఏకంగా 21 అడుగుల ఎత్తైన భారీ వృక్ష శిలాజాన్ని రీసెర్చ్ స్కాలర్స్ గుర్తించినట్లు తెలిపారు. ఈ భౌగోళిక పొరల అమరిక ఆధారంగా ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెం మండలాల పరిధిలో ఇలాం టి పెట్రిఫైడ్ వుడ్ శిలాజాలు మరిన్ని లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రాచీన నదుల గుర్తులు
భూగర్భ జల శాఖ కార్యాలయంలో భద్రపరిచిన నమూనాల్లో బంతిలాంటి గుండ్రటి రాళ్లు, రకరకాల చిన్న చిన్న గులకరాళ్లు, ఇసుక ఒకే బండగా అతు క్కుపోయిన రాళ్లు అలనాటి ప్రవాహాల తీవ్రతను వివరిస్తున్నాయి. వేలాది సంవత్సరాలపాటు నదీ ప్రవాహంలో ఒకదానినొకటి రాపిడికి గురై పర్ఫెక్ట్ గోళాకారంలోకి రూపాంతరం చెందాయి. ఇక చిన్న రాళ్లు ఇసుక సహజ సిద్ధమైన సిమెంట్ లాంటి పదా ర్థాలతో కలిసి ఒక్కటిగా గట్టిపడిపోయాయి. ఇవన్నీ ములుగు ప్రాంతంలో ఒకప్పుడు ఉధృతంగా ప్రవహించిన ప్రాచీన నదులు, వాటి ద్వారా భారీ ప్రవా హాలు ఉండేవని స్పష్టం చేస్తున్నాయి. ఆ కాలంలో నీటి ప్రవాహ వేగం ఎలా ఉండేదో అంచనా వేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
భూగర్భ జల అన్వేషణకు దిక్సూచి
ఈ అరుదైన రాళ్లను భూగర్భ జలశాఖ కార్యాల యంలో ఉంచడం వెనుక పెద్ద శాస్త్రీయ కారణమే ఉంది. ఇవి చూసే ప్రదర్శన వస్తువులు మాత్రమే కావు. భూమి లోపల నీటి జాడను కనిపెట్టడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. భూమి అడుగున నీటి పొరలు ఏయే రాళ్ల శ్రేణుల్లో దొరుకుతాయో అర్థం చేసుకోవడానికి ఇవి ఆధారాలుగా నిలుస్తాయి. ఈ రాళ్ల రకాన్ని, వాటి వయసునుబట్టి ఆ ప్రాంతంలో నీటి లభ్యత, భూగర్భ జలాలు ఏ దిశలో ప్రవహిస్తున్నాయో కచ్చితంగా అంచనా వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ములుగు ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గోదావరి లోయ ప్రాంతం దేశంలోనే అత్యంతం పురాతనమైనది కావడం విశేషం.
పరిశోధనలు జరిపితే మరిన్ని వింతలు
గోదావరి లోయ ప్రాంతం పురాతన జీవరాశుల ఉనికికి పేరొందింది. గతంలో ప్రాణహిత-గోదావరి పరీవాహక ప్రాంతాల్లో డైనోసార్ల అస్థిపంజరాలు, ప్రాచీన వృక్ష శిలాజాలు బయటపడ్డ దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ములుగు జిల్లాలో లభించిన ఈ శిలాజాలు ఆనాటి భూగోళిక వాతావరణాన్ని, వైవిధ్యాన్ని అధ్యాయనం చేయడానికి ఎంతగానో ఉపయో గపడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జిల్లాలో వెలగు చూసిన ఈ అపురూప శిలాజలను కేవలం కార్యాలయానికే పరిమితం చేయకుండా భవిష్యత్ తరాలకు విద్యార్థులకు ఉపయోగపడేలా ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసి ప్రదర్శన చేయాలని స్థానికులు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
ప్రకృతి సృష్టించిన అరుదైన వింత
సుమారు 20 నుంచి 15 కోట్ల సంవత్సరాల క్రితం అప్పర్ జురాసిక్ కాలంలో సంభవించిన భారీ విపత్తుల కారణంగా నాటి మహా వృక్షాలు భూమి పొరల్లో కప్పబడిపోయాయని భూగర్భ జలశాఖ అధికారులు తెలిపారు. గాలి తగలని నేల పొరల్లో, జలాల్లోని సిలికా, ఐరన్ వంటి ధాతువులు కణాల్లోకి ఇంకిపోయి కాలక్రమేణా చెక్క స్థానంలో ఖనిజాలు గట్టిపడి రాళ్లుగా మారాయని చెబుతున్నారు. పైకి చూస్తే అచ్చం చెట్టుబెరడు, మాను కోతలాగే కనిపిస్తుందని, పట్టుకుంటే సీసమంత బరువు, కఠినమైన రాతి గట్టిదనంతో ఉండటం దీని ప్రత్యేకత అని అంటున్నారు.. చెట్టు వలయాలతో సహా ఏమాత్రం పాడవకుండా ఉండటం ప్రకృతి సృష్టించిన అరుదైన వింతని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
Read Latest AP News And Telangana News And International News And Telugu News