గంజాయి సిగరెట్ కావాలా.. నాయనా..!
ABN , Publish Date - Mar 06 , 2026 | 07:05 AM
మండలకేంద్రంలో గంజాయి సిగరెట్ రూ.250కి విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. యువతను టార్గెట్‌గా చేసుకొని గంజా సిగరెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని తాగిన యువకులు మత్తులో తూలుతున్నారు.
యాడికిలో విచ్చలవిడిగా విక్రయాలు
మత్తులో దాడులకు తెగబడుతున్న యువకులు
పాఠశాల విద్యార్థులకూ చేరుతున్న వైనం
యాడికి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో గంజాయి సిగరెట్ (Ganja Cigarettes) రూ.250కి విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. యువతను టార్గెట్‌గా చేసుకొని గంజా సిగరెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని తాగిన యువకులు మత్తులో తూలుతున్నారు. యాడికిలో కేఫ్‌లు, కోన రోడ్డు, ఒక పాఠశాల వెనుకవైపు ఉన్న వెంచర్, పిన్నేపల్లి క్రాస్‌లో యువకులు గంజా సిగరెట్లు తాగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రాయలచెరువుకు చెందిన కొందరు యువకులు వీటిని బెంగళూరు నుంచి తెప్పిస్తున్నట్లు తెలిసింది. రాయలచెరువు, యాడికిలో వీటిని గుట్టుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికుల ద్వారా తెలుస్తోంది. గంజా సిగరెట్లకు బానిసలుగా మారుతున్న యువత.. మత్తులో తల్లిదండ్రులను సైతం కొడుతున్నారు.
ఇటీవల యాడికి సమీపంలోని ఒక గ్రామంలో గంజా మత్తులో ఒక యువకుడు.. కన్నతల్లిని నానా దుర్భాషలాడడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. రెండ్రోజుల క్రితం గంజా సిగరెట్లు ఉన్నాయనే అనుమానంతో యాడికిలో ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. నెలరోజుల క్రితం గుత్తికి చెందిన యువకులు యాడికిలో గంజాయితో పట్టుబడ్డారు. గంజాయి సిగరెట్ల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పదోతరగతి విద్యార్థులు సైతం వీటిని కొనుగోలు చేసి, తాగి పాఠశాలకు వెళ్తున్నట్లు తెలిసింది. పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఎక్కడా అమలుకావడం లేదు. పాఠశాలలు, కళాశాలలకు అతి సమీపంలోనే పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తుండడం గమనార్హం. గంజాయి సిగరెట్, పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాల నివారణకు పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్
ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..
Read Latest Telangana News And AP News And Telugu News