Share News

ఆయకట్టు మొత్తం బీడే..!

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:20 AM

వాన జాడలేక ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని గొట్లూరు చెరువు వట్టిపోతోంది. దీంతో ఆయకట్టులో వరి సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు.

ఆయకట్టు మొత్తం బీడే..!
Anantapur drought

  • పంటలను సాగుచేయని రైతులు

ధర్మవరం(అనంతపురం): వాన జాడలేక ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని గొట్లూరు చెరువు వట్టిపోతోంది. దీంతో ఆయకట్టులో వరి సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. వెరసి ఆయకట్టు మాత్రం బీడుగా దర్శనమిస్తోంది. గతేడాది ముందస్తు వర్షాలు, హంద్రీనీవా కాలువ ద్వారా నీరు రావడంతో ఆయకట్టు మొత్తం పంటలు సాగుచేశారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో చినుకు జాడలేదు. కాలువ ద్వారా నీరు వస్తుందన్న ఆశా లేదు. వర్షాభావ పరిస్థితులు, ఎండల కారణంగా చెరువులో నీరు శరవేగంగా ఇంకిపోతోంది. దీంతో గతేడాది పచ్చని పంటలతో కళకళలాడిన చెరువు ఆయకట్టు ఈసారి బీడుగా దర్శనమిస్తోంది.


ఒట్టిపోయిన చెరువు

ఎల్‌నినో ప్రభావంతో వాన జాడలేకుండా పోయింది. దీంతో గొట్లూరు చెరువులో నీరు తగ్గిపోతోంది. ఇప్పటికే 70శాతానికిపైగా నీరు ఇంకిపోవడంతో చెరువు ఒట్టిపోతోంది. 652.చ.మీ విస్తీర్ణంలో చెరువు ఉంది. చెరువు కింద 600 ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో 695 మంది రైతులు పంటలు సాగుచేసుకుంటున్నారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో మొత్తం వరి సాగుచేశారు. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎకరాలో కూడా పంటలు సాగు కాలేదు. వర్షంపై ఆశలు వదులుకున్నారు. హంద్రీనీవా జలాలు వస్తాయన్న నమ్మకం కూడా సన్నగిల్లింది. ఇప్పుడిప్పుడే శ్రీశైలం జలాశయానికి వరద వస్తోంది. డ్యాం నిండినా వరి సాగుకు నీరు వదులుతారన్న ఆశలులేవు. దీంతో పంట సాగుకు రైతులు దూరమయ్యారు. భూగర్భ జలమట్టం తగ్గి బోరుబావులు వట్టిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో బోరుబావుల కింద పంటల సాగుకు ఆసక్తి చూపట్లేదు.


dm1.2.jpgసాగు తగ్గించాం..

బోరుబావుల కింద వరి సాగుకూ వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. చెరువులో నీరు తగ్గిపోతుండటంతో బోరుబావి కూడా వట్టిపోయే ప్రమాదం ఉంది. రెండెకరాలకుగాను ఎకరాలోనే వరి పంట పెట్టా. నీరివ్వకపోతే రబీలో పంటలు సాగుచేసుకునే అవకాశమే ఉండదు.

  • గోపాల్‌, గొట్లూరు


వర్షాలు కురిస్తేనే నీరిస్తాం

వర్షాలు కురవకనే చెరువుల్లో నీరు తగ్గిపోతోంది. వర్షాలు కురిస్తేనే నీరు విడుదల చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది.

  • గురుప్రసాద్‌, ఇరిగేషన్‌ డీఈ, ధర్మవరం


బోరుబావుల్లో చుక్క నీరు రాదు

చెరువుకు నీరు వదలకపోతే బోరుబావుల్లో చుక్క కూడా వచ్చే పరిస్థితి లేదు. చెరువు ఆయకట్టులో ఎకరా భూమి ఉంది. అందులో వరినాటుదామంటే నీరు చాలదు. ఈ ఏడాది ఆయకట్టులో ఎవరూ పంట పెట్టలేదు. వర్షాలు కూడా సకాలంలో కురవపోవడంతో దిగుబడిపై ఆందోళనగా ఉంది.

  • నారాయణస్వామి, గొట్లూరు


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీలో పెరగనున్న వర్షాలు

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 11:20 AM