Share News

ఐఆర్‌ఎఫ్‏సీ కాదంటే మరొకటి..!

ABN , Publish Date - Aug 01 , 2026 | 10:29 AM

మెట్రో మొదటి దశ టేకోవర్‌పై హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఐఆర్‌ఎఫ్‏సీ కాదంటే మరొకటి..!
Hyderabad Metro Rail

  • ఇతర జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు

  • 3.5 నుంచి 4 శాతం వడ్డీతోనే తీసుకునేందుకు చర్యలు

  • మెట్రో టేకోవర్‌పై హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సీరియస్‌ ఫోకస్‌

హైదరాబాద్‌ సిటీ: మెట్రో మొదటి దశ టేకోవర్‌పై హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‏సీ) 3.5 నుంచి 4 శాతం వడ్డీతో అందించే రుణాలు ఎలాగైనా తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే అంతే సమానమైన వడ్డీతో అందించే బ్యాంకుల నుంచి పొందేందుకు సీరియ్‌సగా ప్రయత్నిస్తున్నారు. కేంద్రం పూచీకత్తుతో అందించే ఐఆర్‌ఎ్‌ఫసీ రుణాల్లో జాప్యం జరుగుతుండడంతో దాని ప్రభావం రెండో దశ పనులపై పడుతున్న నేపథ్యంలో ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.


ఈ అంశాన్ని మరో 15 రోజుల్లో తేల్చే దిశగా అడుగులు వేస్తుండడం ఆసక్తికరంగా మారింది. నగరంలో మొదటి దశ మెట్రో ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిర్మాణ పనులు చేపట్టిన ఎల్‌అండ్‌టీ నుంచి రూ.15వేల కోట్లతో దానిని టేకోవర్‌ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కృషి చేస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించకపోవడంతో పాటు వివిధ సాంకేతిక కారణాలు అడ్డుపడుతుండడంతో ఎటూ కదలని పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ సర్కార్‌తో పాటు నగరవాసులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.


ప్రత్యామ్నాయంగా..

రూ.13,600 కోట్ల రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్‌ఎఫ్‏సీని కొద్ది రోజుల క్రితం సంప్రదించిన విషయం తెలిసిందే. 4 శాతం వడ్డీతో సదరు కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకుని దానిని ఎల్‌అండ్‌టీకి చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. మిగతా రూ.1400 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి ఇచ్చే విధంగా అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఐఆర్‌ఎఫ్‏సీ.. రుణం ఇచ్చేందుకు అనుకూలంగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సందిగ్దంలో పడింది. ఈ తరుణంలో ఐఆర్‌ఎఫ్‏సీకి సమానమైన వడ్డీతో రుణాలు ఇచ్చే బ్యాంకులను సంప్రదిస్తోంది. దీంతో ఆ దిశగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు ముందుకు సాగుతున్నారు. అయితే ఇందులో భాగంగా హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హడ్కో) దగ్గరికి వెళ్లి రుణాలపై చర్చించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో యూనియన్‌ బ్యాంకు, ఎస్‌బీఐ లాంటి జాతీయ బ్యాంకులను కలిసి రుణాలపై మాట్లాడనున్నట్లు ఓ అధికారి తెలిపారు.


city5.2.jpgఫైనాన్స్‌ ఏజెన్సీల నియామకం

ఐఆర్‌ఎఫ్‎సీ రుణాలపై దోబూచులాట నెలకొన్న నేపథ్యంలో మళ్లీ ఫైనాన్స్‌ ఏజెన్సీల నియామకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను వారం, రోజుల్లో పూర్తిచేసి రుణాలపై స్పష్టతనివ్వాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఏజెన్సీల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించనుంది.


పాతబస్తీ కారిడార్‌ టెండరు రద్దు

రెండో దశ ప్రాజెక్టులో భాగంగా కారిడార్‌-6 కింద ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట వరకు (7.5 కిలోమీటర్లు) చేపడుతున్న విషయం తెలిసిందే. దీనిని రూ.2,741 కోట్లతో పూర్తి చేసేందుకు నిర్ణయించారు. అయితే ఈ కారిడార్‌ కోసం గతంలో జనరల్‌ కన్సల్టెన్సీ కింద టెండర్లను ఆహ్వానించగా.. ఒకటి మాత్రమే దాఖలైంది. దీంతో దానిని రద్దు చేసి మళ్లీ టెండర్లకు వెళ్లేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ బోర్డు సభ్యులు నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రేపటి నుంచి సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 10:29 AM