Share News

ఇదే నా మొదటి, చివరి తప్పు.. క్షమించండి: ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన బాలిక..

ABN , Publish Date - Aug 01 , 2026 | 10:09 AM

నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ అంశంపై నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని దూషించిన బాలిక క్షమాపణలు చెప్పింది. ఆమెపై కేసు నమోదు కావడంతో ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసింది.

ఇదే నా మొదటి, చివరి తప్పు.. క్షమించండి: ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన బాలిక..

న్యూఢిల్లీ: నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ అంశంపై నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని దూషించిన బాలిక క్షమాపణలు చెప్పింది. ఆమెపై కేసు నమోదు కావడంతో ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసింది. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, తప్పు తెలిసొచ్చిందని పేర్కొంది. తనను దుర్భాషలాడిన పలువురు యువతను క్షమిస్తున్నట్లు ప్రధాని మోదీ వీడియో విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ బాలిక క్షమాపణల వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ప్రధానిని దూషించిన బాలిక మాట్లాడుతూ.. 'ఢిల్లీలో జరిగిన నిరసనలో కొంతమంది ప్రభావానికి లోనై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాను. ఆయనను దుర్భాషలాడాను. నా వయసు కేవలం 15 ఏళ్లే. నేను చేసింది క్షమించదగినది కాదు. చాలా చెడ్డ మాటలు మాట్లాడాను. ఇదే నా మొదటి, చివరి తప్పు. నేను ప్రధానికి, దేశం మొత్తానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను నేనే చూసుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి' అని చెప్పింది. కాగా, ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ బాలికపై బుధవారం నోయిడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


ఆమెపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అనంతరం కేసును న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాలిక చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి కార్యాలయ గౌరవాన్ని అవమానించేలా, అశాంతిని వ్యాప్తి చేసి ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదుదారుడు పేర్కొనడంతో కేసు నమోదైంది. దీంతో బాలిక క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. అయితే, ఎఫ్‌ఐఆర్‌లో ఆమె వయసు 25 ఏళ్లుగా నమోదు కాగా.. క్షమాపణ వీడియోలో మాత్రం ఆమె తన వయసు కేవలం 15 ఏళ్లని చెప్పింది.


ఈ వార్తలు కూడా చదవండి

భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..

రాహుల్ గాంధీపై విమర్శలు.. ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్స్ పోస్టు వైరల్..

Updated Date - Aug 01 , 2026 | 11:15 AM