Share News

Kavitha: ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్

ABN , Publish Date - Nov 08 , 2025 | 03:03 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు బంద్‌కి దిగారని గుర్తుచేశారు కవిత.

Kavitha: ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే  వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్
Kavitha VS CM Revanth Reddy

వరంగల్, నవంబరు8 (ఆంధ్రజ్యోతి):సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగినందుకు సీఎం రేవంత్‌రెడ్డి వీధి రౌడీలాగా మాట్లాడారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ(శనివారం) వరంగల్‌లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో కవిత పాల్గొన్నారు. కవితకి కాజీపేట ఫాతిమా నగర్ బ్రిడ్జి దగ్గర బోనాలతో తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు బంద్‌కి దిగారని గుర్తుచేశారు. ఆయా కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చారని.. కానీ ప్రైవేట్ కాలేజీలకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తు గురించి రేవంత్‌రెడ్డి సర్కార్ వెంటనే ఆలోచించాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు వరంగల్ నగరంలో ఉండి స్థానిక సమస్యలు తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు కవిత.


వరద బాధితులకి న్యాయం చేయాలి..

అలాగే, వరంగల్ నగరంలోని సమ్మయ్యనగర్ కాలనీలో వరద బాధిత ప్రాంతాల్లో కవిత పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు. వరద బాధితులకి న్యాయం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని.. కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం మాట అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పుకొచ్చారు కవిత.


వరద బాధితులకు ఇప్పటిదాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కనీస తక్షణ సాయం చేయలేదని ప్రశ్నించారు. వరద బాధితులు ఒక్కరికీ నయా పైసా కూడా ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. వరంగల్ జిల్లా కలెక్టర్ వెంటనే బాధితులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరంగల్ నగరాన్ని వరదలు చుట్టుముట్టాయని ఆరోపించారు. ఇది ప్రకృతి విపత్తు కాదని కాంగ్రెస్ తెచ్చిన విపత్తు అని ఎద్దేవా చేశారు కవిత.


ఎంజీఎం ఆస్పత్రిలో కనీస వసతులు లేవు..

మరోవైపు.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కవిత పర్యటించారు. రోగుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిని గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఎంజీఎంలో రోగులకు కనీస మౌలిక వసతులు కరువయ్యాయని తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో సూది ఉంటే దూది లేదని.. దూది ఉంటే సూది లేదని విమర్శించారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళ మంత్రులు ఉన్న ప్రసూతి ఆస్పత్రి దౌర్భాగ్య స్థితిలో ఉందని ఆక్షేపించారు. రాజకీయ ఉద్దేశంతో తాను పర్యటనలు చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రజా సమస్యల మీద తాను పోరాటం చేస్తున్నానని కవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల!

కిసాన్‌ డ్రోన్‌.. సాగు ఖర్చు డౌన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2025 | 03:19 PM