Share News

Kamareddy Floods: వరద బీభత్సం

ABN , Publish Date - Aug 29 , 2025 | 03:49 AM

ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.

Kamareddy Floods: వరద బీభత్సం

భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం

  • వణికిన మెదక్‌.. 48 గంటల్లో 55 సెం.మీ. వాన

  • నిర్మల్‌, రాజన్న సిరిసిల్లల్లోనూ కుండపోత

  • రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాత

  • జలదిగ్బంధంలో పలు గ్రామాలు, తండాలు

  • తెగిన రోడ్లు, కొట్టుకుపోయిన వంతెనలు

  • హైవే-44పై వరద.. కి.మీ. మేర ట్రాఫిక్‌ జామ్‌

  • వరదల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం

  • 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం

  • విధుల్లో 2వేల మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది: డీజీపీ

  • బండి సంజయ్‌ అభ్యర్థన మేరకు 4 హెలికాప్టర్లను పంపిన కేంద్రం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి. కల్వర్టులు కొట్టుకుపోయాయి. వాగులు పొంగాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధమయ్యాయి. రహదారులు ధ్వంసమై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో గంటలకొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పదుల సంఖ్యలో గ్రామాల్లో విద్యుత్‌ నిలిచిపోయి అంధకారం అలముకుంది. చాలా జిల్లాల్లో మంగళవారం సాయంత్రం పట్టిన ముసురు.. విడవకుండా గురువారం సాయత్రం దాకా అలాగే ఉంది!! ముఖ్యంగా.. కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంతో పాటు ఏ గ్రామాన్ని, తండాను కదిలించినా వరద కన్నీటిగాథలే. జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గోండ గ్రామంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు కేవలం 6 గంటల్లోనే 36.8 సెం.మీల వర్షపాతం నమోదుకావడం గమనార్హం. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లా యంత్రాంగం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా వరదల్లో చిక్కుకున్న 1071 మందిని కాపాడింది. వరదల తాకిడికి కామారెడ్డి జిల్లాలో 58 రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కామారెడ్డి పట్టణ కేంద్రం నుంచి మొదలుకుని భిక్కనూరు వరకు 44వ జాతీయ రహదారిపై వరదలు ఉధృతంగా ప్రవహించడంతో బుధవారం రోజంతా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లి, బస్వాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై వరదలో చిక్కుకున్న పలువురు వాహనదారులను పోలీసులు రక్షించారు. తిప్పాపూర్‌- రామేశ్వర్‌పల్లి మధ్యలోని రైల్వేమార్గం వరదల తాకిడికి ట్రాక్‌ కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.

మెదక్‌జిల్లాలో..

మెదక్‌జిల్లాలో 48 గంటల వ్యవధిలో 55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్‌ పట్టణంలో పుష్పల వాగు ఉధృతికి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ కొట్టుకుపోవడంతో 9 గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. హవేళీ ఘనపూర్‌ మండలంలో నక్కవాగు పొంగిపొర్లడంతో భోధన్‌-మెదక్‌ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొచ్చెరువు, దేవుని చెరువు కట్టలు తెగిపోయి నీరు ప్రవహించడంతో రైల్వే ట్రాక్‌ ధ్వంసమైంది. అక్కన్నపేట రైల్వేట్రాక్‌ కింద కంకర కొట్టుకుపోయి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

2.jpg


ఇతర జిల్లాల్లో..

  • ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాల ధాటికి పెన్‌గంగా, కడెం నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేల ఎకరాల్లో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ధన్నూర్‌ గ్రామంలో ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయినా.. ప్రాణాలతో బయటపడ్డాడు.

  • ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జలగలంచ వాగు ఉధృతంగా ప్రవహించడంతో మొడ్యాల తోగు వద్ద 163 జాతీయ ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్నవరం ఆయకట్టులోని నాలుగు పంటకాల్వలకు సుమారు 15 చోట్ల గండ్లు పడ్డాయి.

  • భూపాలపల్లి ఏరియా పరిధిలోని మల్హర్‌ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్టు, గణపురం మండలంలోని మాధవరావుపల్లి సమీపంలోని ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు-3లోకి భారీగా వరద నీరు చేరి 2 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లింది.

  • యాదాద్రిభువనగిరి జిల్లాలో సంగెం-బొల్లెపల్లి, రుద్రవల్లి-జూలురు లోలెవల్‌ బ్రిడ్జీల పై నుంచి 3-4 అడుగుల ఎత్తులో మూసీ పరవళ్లు తొక్కుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌65)పై.. భువనగిరి-చిట్యాల రహదారిలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

  • మంగళవారం నుంచి కురిసిన వర్షానికి వికారాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని వాగులు పొంగి ప్రవహించాయి. గండిపేట, హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలను తలపిస్తున్నాయి.

  • సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్‌కా్‌స్టలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

మృతులు.. గల్లంతైనవారు..

  • కామారెడ్డి జిల్లాలో భారీవర్షాలు, వరదల తాకిడికి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రాజంపేటలో ఇప్పకాయల వినయ్‌కుమార్‌(29) అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున వరద ఒక్కసారిగా రావడంతో గోడకూలి మృతిచెందాడు. మృతుడు గుండారం గ్రామంలో పల్లెదవాఖానాలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. బీబీపేట మండలం జనగామలో కప్పెరా రాజారెడ్డి(63) గ్రామశివారులోని తన పశువుల పాక వద్దకు వెళ్లగా ఎడ్లకట్ట వాగు వరదతో ఒక్కసారిగా పొటెత్తడంతో వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు.

  • మెదక్‌ జిల్లా రాజ్‌పేట గ్రామం గంగమ్మవాగులో ఆటో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అందులో ఉన్న బెస్త సత్యనారాయణ, యాదగౌడ్‌లు కొట్టుకుపోయారు. వారిలో సత్యనారాయణ మృతదేహం లభ్యమైంది.

  • ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మండలంలో ఆకేరు వాగులో పడి మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన సీహెచ్‌.మునీ్‌ష(25) మృతిచెందాడు. అతడు వీరారం నుంచి మంగళవారం తిరుమలాయపాలెం మండలం గుండా ఆటోలో వెళుతుండగా ఆటో చెడిపోయింది. నడిచి రాకాసితండావైపు వెళుతూ వాగుదాటే ప్రయత్నం చేసి.. వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు. అతడి మృతదేహం గురువారం లభ్యమైంది.

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు ప్రాజెక్టు వద్దకు గేదెలు మేపడానికి నర్మాల గ్రామానికి చెందిన ఆరుగురు రైతులు వెళ్లారు. వీరిలో ఒకరు వరద నీటిలో గల్లంతు కాగా గురువారం ఐదుగురిని హెలికాప్టర్‌ ద్వారా రక్షించారు.

4 వర్సిటీల్లో పరీక్షలు వాయిదా

భారీ వర్షాల కారణంగా శుక్ర, శనివారాల్లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వాయిదా పడిన పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే.. 28, 29 తేదీల్లో కాకతీయ వర్సిటీలో.. 29, 30 తేదీల్లో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. శాతవాహన వర్సిటీ పరిధిలో గురువారం జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. వాటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో తెలియజేయనున్నారు.

ఎస్సారెస్పీ గేట్లు మూయించి మరీ..

నిర్మల్‌ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా కుండపోతగా వాన కురిసింది. కుంభవృష్టి దాటికి.. లక్ష్మణచాంద మండలంలోని మునిపెల్లి వద్ద గోదావరి కుర్రులో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపర్లను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడాయి. వీరిలో పార్‌పెల్లి తండాకు చెందిన శంకర్‌ నాయక్‌ అనే వ్యక్తిని కాపాడేందుకు నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెలికాప్టర్‌ కోసం ప్రయత్నించారు. గోదావరిలో నీటిమట్టం భారీగా ఉండడంతో ఎస్సారెస్పీ గేట్లను కొద్దిసేపు మూసి వేయించారు. నీటి ఉధృతి తగ్గగానే ఎన్డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందం శంకర్‌ నాయక్‌ను కుర్రు నుంచి బయటకు తీసుకువచ్చారు.

3.jpg


గర్భిణులను కాపాడారు..

జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం వడ్డెలింగాపూర్‌లో కళ్యాణి అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు రాయికల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. దారిలో.. వాగు నీరు రహదారిపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో కొందరు యువకులు ఎక్స్‌కవేటర్‌ సహాయంతో గర్భిణిని వాగు నీటి నుంచి ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో రాయికల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే.. మెదక్‌జిల్లా రాజ్‌పేట తండాకు చెందిన మాలోత్‌ హరితకు పురిటినొప్పులు రాగా.. బూర్గుపల్లి వద్ద బ్రిడ్జి కొట్టుకుపోయి రవాణా నిలిచిపోవడంతో ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బంది ఆమెను 108 అంబులెన్సులో మెదక్‌ ఆస్పత్రికి తరలించారు.

చివరి మజిలీలో.. వరద కష్టాలు

3.jpg

సిద్దిపేట జిల్లాలోని రేగోడ్‌ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన బండి హరి అనే దివ్యాంగుడు బుధవారం గుండెపోటుతో మరణించాడు. కానీ.. దారిలో గొల్లవాగు ఉధృతి కారణంగా ముందుకు వెళ్లలేకపోయారు. చివరికి ఒక ట్రాక్టర్‌కు తాడు కట్టి దానికి జేసీబీ సహాయంతో మృతదేహాన్ని వాగు దాటించారు. మరోవైపు.. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన తుమ్మ ఆగమ్మ అనే మహిళ గుండెపోటుతో మరణించారు. ఆమె దహన సంస్కారాల కోసం కుటుంబసభ్యులు వైకుంఠధామానికి వెళ్లగా, అది పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో చేసేదేమీ లేక, గ్రామస్థులు రోడ్డు మీదనే అంత్యక్రియలు పూర్తి చేశారు.

భారీ వర్షాలతో పలు రైళ్ల రద్దు

3.jpg

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో పట్టాలపైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో 29, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట్‌-మల్కాజిగిరి (77656), మెదక్‌-కాచిగూడ (77604), బోదన్‌-కాచిగూడ (57414), కాజీపేట్‌-సిర్పూర్‌ టౌన్‌ (17003), బలార్షా-కాజీపేట్‌ (17004), బలార్షా-కాజీపేట్‌ (17036), బీదర్‌-కాలాబురాగి(77631), కాలాబురాగి-బీదర్‌ (77632), బీదర్‌-కాలాబురాగి (77638), కాలాబురాగి-బీదర్‌ (77635), బీదర్‌-కాలాబురాగి (77633), కాలాబురాగి-బీదర్‌ (77634), బీదర్‌-కాలాబురాగి (77636), కాలాబురాగి-బీదర్‌ (77637), కాజీపేట్‌-బలార్షా (17035), సిర్పూర్‌టౌన్‌ (67772), సిర్పూర్‌టౌన్‌-కరీంనగర్‌ (67771), కరీంనగర్‌-బోధన్‌ (67773), బోధన్‌-కరీంనగర్‌ (67774) రైళ్లను రద్దు చేశారు. శనివారం బలార్షా-కాజీపేట్‌ (17036), నర్కేర్‌-కాచిగూడ (17642), నాగర్‌సోల్‌-కాచిగూడ (17662)రైళ్లను రద్దు చేశారు. ప్రయాణీకుల కోసం దక్షిణ మఽధ్యరైల్వే వివిధ రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఆ వివరాలు.. కాచిగూడ స్టేషన్‌(9063318082) సికింద్రాబాద్‌ స్టేషన్‌(040-27786170), నిజామాబాద్‌ స్టేషన్‌(970329671), కామారెడ్డి స్టేషన్‌ (రైల్‌ నెంబర్‌: 9281035664)


17ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకుపైగా

బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల దాకా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 200 మిల్లీమీటర్ల(20 సెం.మీ.)కు మించి వర్షపాతం కురిసిన ప్రాంతాలు..

మండలం జిల్లా ప్రాంతం వర్షపాతం

(మి.మీలో)

రాజంపేట కామారెడ్డి ఆర్గొండ 440.5

నిర్మల్‌ రూరల్‌ నిర్మల్‌ అక్కాపూర్‌ 325.3

హవేలీఘన్‌పూర్‌ మెదక్‌ సర్దానా 316

కామారెడ్డి కామారెడ్డి ఐడీవోసీ 308.5

తాడ్వాయి కామారెడ్డి తాడ్వాయి 289.8

లక్ష్మణచాంద నిర్మల్‌ వడ్యాల్‌ 281.3

భిక్నూర్‌ కామారెడ్డి భిక్నూర్‌ 279

హవేలీఘన్‌పూర్‌ మెదక్‌ నాగపూర్‌ 278.8

కామారెడ్డి కామారెడ్డి పాతరాజంపేట 249.8

నిర్మల్‌ నిర్మల్‌ విశ్వనాథ్‌పేట 241.3

నిర్మల్‌ రూరల్‌ నిర్మల్‌ ముజిగి 232

చేగుంట మెదక్‌ చేగుంట 231.8

లింగంపేట కామారెడ్డి లింగంపేట 229

రామాయంపేట మెదక్‌ రామాయంపేట 208

మెదక్‌ మెదక్‌ మెదక్‌ 207.5

కొమురవెల్లి సిద్దిపేట్‌ కొమురవెల్లి 207.3

దోమకొండ కామారెడ్డి దోమకొండ 202

బాగున్నారా?

  • అనుకోకుండా ఎదురుపడి పలకరించుకున్న బండి సంజయ్‌.. కేటీఆర్‌

  • కేంద్రంతో మాట్లాడి.. నాలుగు హెలికాప్టర్లను రప్పించిన బండి సంజయ్‌

    3.jpg

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన ఆరుగురు పశులకాపరులు వరదల్లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలియగానే.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. వైమానిక దళం అధికారులతో మాట్లాడి నాలుగు హెలికాప్టర్‌లను పంపించాలని కోరారు. సంజయ్‌ అభ్యర్థన మేరకు తక్షణం హెలికాప్టర్లు అందుబాటులో ఉంచాలని రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదేశించారు. ఈమేరకు గురువారం ఉదయమే 2 హెలికాప్టర్లు నర్మాల చేరుకుని వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించాయి. మరో 2 హెలికాప్టర్లను సిరిసిల్లకు పంపించారు. కాగా.. గురువారం ఆ పశులకాపరులను బండి పలకరించారు. అనంతరం వరదల్లో గల్లంతైన నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య కుటుంబ సభ్యులనూ పరామర్శించారు. నాగయ్య కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఆయన అక్కణ్నుంచీ వెళుతుండగా దారిలో మాజీ మంత్రి కేటీఆర్‌ ఎదురయ్యారు. బండి సంజయ్‌ను చూడగానే ఆయన కాన్వాయ్‌ వద్దకు కేటీఆర్‌ వచ్చారు. బండి కూడా వాహనం దిగి కేటీఆర్‌ వద్దకు వెళ్లారు. ఇద్దరూ పరస్పరం అభివాదం చేసుకుని.. బాగున్నారా? అంటూ పలకరించుకున్నారు. కష్టపడుతున్నారంటూ కేటీఆర్‌ ఈ సందర్భంగా బండి సంజయ్‌ను ఉద్దేశించి అన్నారు. అనంతరం నర్మాల బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్‌ వెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 03:50 AM