Share News

BRS MLC Kavitha: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించుకుంటాం:ఎమ్మెల్సీ కవిత

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:43 PM

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్కరోజైనా బీసీ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. బీసీ బిల్లు వస్తే ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, నిధులు వస్తాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

BRS MLC Kavitha: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించుకుంటాం:ఎమ్మెల్సీ కవిత
BRS MLC Kalvakuntla Kavitha

మెదక్ జిల్లా: బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లు (BC Reservation) సాధించుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) తెలిపారు. బీసీలంతా చైతన్యం కావాలని కోరారు. కామారెడ్డి‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల సమయంలో ప్రకటించిన డిక్లరేషన్ సాధించే వరకు పోరాడుతామని అన్నారు. ఇవాళ(మంగళవారం) మెదక్ జిల్లాలో కామారెడ్డి డిక్లరేషన్ రాజ్యాంగ బద్దంగా 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇది రాజకీయ వేదిక కాదు.. మానవ హక్కుల వేదిక అని చెప్పారు.


విద్యకు, ఉద్యోగాలకు, రాజకీయాలకు వేర్వేరుగా రేవంత్ ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లులు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ బిల్లు పంపామని తమకు ఏం సంబంధం లేదనేలా కాంగ్రెస్ నేతలు అనడం సరికాదని చెప్పారు. బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు ఒక్కరోజైనా బీసీ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారా అని ప్రశ్నించారు. బీసీ బిల్లు వస్తే ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, నిధులు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో చిత్తశుద్ధి లేదని తెలిపారు ఎమ్మెల్సీ కవిత.


బీసీ బిల్లు సాధనకు కేంద్రప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావడానికి జులై 17వ తేదీన రైల్‌రోకో చేపడతామని ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల అంశం తేలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామనడం సరికాదని అన్నారు. బీసీలకు రిజర్వేషన్‌లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఆపుతామని చెప్పారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడితే బీసీ బిడ్డల కాళ్ల వద్దకు పదవులు వస్తాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 02:54 PM