Konda Surekha: వరంగల్ కాంగ్రెస్‌లో రచ్చ.. మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యే నాయిని
ABN , Publish Date - Sep 13 , 2025 | 07:45 PM
మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాయిని చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు.
వరంగల్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కొంచెం ఆసక్తికరంగా, వివాదంగా ఉంటాయి. అందులోనూ కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఒకే పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీల నాయకులపై విరుచుకుపడ్డ తీరులో సొంతపార్టీ నాయకులపైనే విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా.. మరోసారి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా.. మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాయిని చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు. నాయిని రాజేందర్ అదృష్టం కొద్ది ఎమ్మెల్యేగా గెలించారని కీలక వ్యాఖ్యలు చేశారు. నాయిని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. నాయినిపై తాను కామెంట్ చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా..? అని ఆమె ప్రశ్నించారు. కేవలం తాము అధిష్ఠానం నుంచి వచ్చిన పేర్లను మాత్రమే భర్తీ చేశామని వివరించారు.
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. తాము ఏది చేసినా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని ఎమ్మెల్యే నాయిని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళీ ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారు..? అని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రానా ఏదైనా చేయొచ్చా..? అని నిలదీశారు.
తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటీ..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతి అవలంభిస్తే తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. అంతా మంత్రి చేస్తే స్థానికంగా తాను ఉన్నది దేనికీ..? అంటూ ఎమ్మెల్యే నాయిని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్దరి వ్యవహరంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని