ABN Andhrajyothy Report: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఆ భూముల ఆక్రమణపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:03 PM
ఐడీపీఎల్ భూముల ఆక్రమణలపై ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఓ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సదరు భూములపై విజిలెన్స్ అధికారుల విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ సర్కార్.
హైదరాబాద్, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): ఐడీపీఎల్ భూముల ఆక్రమణలపై (IDPL Lands Encroachment) ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)లో ఓ కథనం ప్రచురితమైంది. ఈ కథనం మేరకు తెలంగాణ సర్కార్ (Telangana Government) స్పందించింది. ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన భూములపై విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే కూకట్‌పల్లి సర్వే నంబర్ 376లో ఏం జరిగిందో తేల్చనున్నారు విజిలెన్స్ అధికారులు. ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం.
విచారణను స్వాగతిస్తున్నాం: కృష్ణారావు

ఈ విషయమై హైదరాబాద్ వేదికగా ఇవాళ(మంగళవారం) కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయమై గతంలో తానే విచారణను కోరానని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. దమ్ముంటే ఆరోపణలు నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
ఈ విషయమై గత 20 ఏళ్లుగా తనపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారావు అన్నారు. తాజా విచారణతో దీనిపై ఓ స్పష్టత వస్తుందని తెలిపారు. ఐడీపీఎల్ భూములపై సీబీఐ అధికారులతో దర్యాప్తు చేపట్టడం సహా.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని తానే కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని చెప్పారాయన.
గాజుల రామారంలోని సర్వే నంబర్ 307లో పేదల ఇళ్లు కూల్చారని.. కానీ, శేరిలింగంపల్లిలో కబ్జా చేసిన స్థలాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కృష్ణారావు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని మోదీతో భేటీ విషయాలను లీక్ చేసిందెవరు.. కిషన్‌రెడ్డి ఫైర్
వార్డుల డీ లిమిటేషన్‌పై జీహెచ్ఎంసీ కౌన్సిల్ చర్చ
Read Latest Telangana News And Telugu News