CM Revanth Reddy: ఉద్యోగుల సమస్యలపై స్పెషల్ ఫోకస్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 06:31 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆయా శాఖల్లో పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. శాఖల మధ్య సమన్వయంపై కీలక సూచనలు చేశారు.
పూర్తి వివరాలు ఇవ్వాలి..
ప్రతీ సెక్రటరీ వారి వారి శాఖల్లో ఉన్న రెగ్యులర్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు జనవరి 26వ తేదీలోగా సీఎస్‌కు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల హోచ్‌వోడీలు వెరిఫై చేయాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ ప్రక్రియను జనవరి 26వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. జనవరి 26వ తేదీలోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఆ పాలసీ లేకపోవడంతో సమస్యలు..
‘ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం. కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే ముఖ్యమైన విభాగాలకు ఒక పాలసీని తీసుకున్నాం. రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశాం. రాష్ట్రాన్ని క్యూర్ ( CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE)గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. స్పష్టమైన విధి విధానాలతో మేము ముందుకు వెళ్తున్నాం’ అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి.
అధికారుల సహకారం ఉండాలి..
‘ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అధికారుల సహకారం ఉండాలి. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి. ప్రతీ నెల కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్షిస్తారు. కార్యదర్శులు సీఎస్‌కు ప్రతీ నెల రిపోర్ట్ సమర్పించాలి. ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీ పనితీరుపై నేనే స్వయంగా సమీక్షిస్తా. ఆయా శాఖల మధ్య, అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావు. అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయడం అత్యంత కీలకం. తెలంగాణ అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
ఆ ఛార్జీలు రద్దు చేయాలి.. టీజీఈఆర్సీకి నీటిపారుదల శాఖ లేఖ
For More TG News And Telugu News