GHMC Ward Delimitation: జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై అభ్యంతరాల వెల్లువ.. ప్రత్యేక కౌన్సిల్ భేటీ
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:46 PM
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాల స్వీకరణ ఈరోజు(సోమవారం)తో పూర్తికానుంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కానుంది.
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు (GHMC Ward Delimitation Objections) వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాల స్వీకరణ ఈరోజు(సోమవారం)తో పూర్తికానుంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ కౌన్సిల్‌లో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్. ఇప్పటి వరకు 1,328 అభ్యంతరాలు వచ్చాయి. నిన్న(ఆదివారం) ఒక్కరోజే 227 అభ్యంతరాలు స్వీకరించారు అధికారులు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపడానికి జీహెచ్ఎంసీకి క్యూ కట్టారు నగర ఎమ్మెల్యేలు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు.
మేయర్‌కు వినతిపత్రం..
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో మేయర్ గద్వాల విజయలక్ష్మి సమావేశం అయ్యారు. వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా చేయాలంటూ మేయర్‌కు వినతిపత్రం ఇచ్చారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలవనున్నారు. నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు. వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపనున్నారు.
వార్డుల విభజనపై కన్ఫ్యూజన్: ఎమ్మెల్యే దానం నాగేందర్

జీహెచ్ఎంసీ (GHMC) వార్డుల పునర్విభజనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వార్డుల విభజనపై తమకు కన్ఫ్యూజన్ ఉందని తెలిపారు. డీ లిమిటేషన్‌పై అభ్యంతరం తెలపడానికి కమిషనర్‌ను కలిశామని వెల్లడించారు. కనీసం తమకు సమాచారం లేకుండానే, ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండానే డీ లిమిటేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్‌పై కార్పొరేటర్లలో ఆవేదన ఉందని చెప్పుకొచ్చారు. తమ అభ్యంతరాలు మేయర్, కమిషనర్‌కి లిఖిత పూర్వకంగా ఇచ్చామని వివరించారు. జీహెచ్ఎంసీ విస్తరణ జరగడం బాగుందని.. కానీ తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని... వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.
ఆ సమస్యలు గుర్తించాం: అరికెపూడి గాంధీ

డివిజన్ల విభజనపై ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలు గుర్తించామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. కొన్ని డివిజన్‌లలో ఎక్కువ ఓట్లు మరికొన్ని డివిజన్‌లలో తక్కువ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రతి విషయాన్ని మేయర్, కమిషనర్‌లకు వివరించామని అన్నారు. కౌన్సిల్‌లో అభ్యంతరాలపై వివరంగా చర్చిస్తామని తెలిపారు. వార్డులు మార్పు చేయడానికి ఏం అవకాశం ఉందో గుర్తించాలని అన్నారు. హద్దులు తెలియకుండా అధికారులు వాటిని ఖరారు చేశారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ వేళ ఉద్రిక్తత.. హౌస్ అరెస్టులు
బర్త్ డే పార్టీ.. దువ్వాడ మాధురి శ్రీనివాస్ బంధువుకు నోటీసులు
Read Latest Telangana News And Telugu News